Updated: October 27, 2019, 10:16 AM IST
జూనియర్ ఎన్టీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (FIle)
జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం కూడా చేశారు. అయితే ఆ తరువాత వివిధ కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు నేతలు మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. వారిలో ఒకరు ఏపీ మంత్రి కొడాలి నాని కాగా, మరొకరు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఎన్టీఆర్ కారణంగానే టీడీపీలో ఈ ఇద్దరికీ ప్రాధాన్యత దక్కిందనే ప్రచారం ఉంది. అయితే ఆ తరువాత తమదైన రాజకీయ వ్యూహాలతో ఈ ఇద్దరి పొలిటికల్ జర్నీ కొనసాగుతోంది.
కొన్నేళ్ల క్రితమే టీడీపీని వీడి వైసీపీలో చేరిన కొడాలి నాని ప్రస్తుతం ఏపీ కేబినెట్లో మంత్రిగా ఉండగా... టీడీపీలోనే కొనసాగుతున్న వల్లభనేని వంశీ... రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తాజాగా వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లబోతున్నారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీపావళి తరువాత ఆయన దీనిపై ఓ ప్రకటన చేయబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. వంశీ పార్టీ మార్పు వార్తలతో మరోసారి టీడీపీ వర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ చర్చ మొదలైంది.
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న వంశీ కూడా వైసీపీలోకి వెళ్లనుండటంతో... ఇక జూనియర్ ఎన్టీఆర్ బ్యాచ్ అంతా వైసీపీలోకి వెళ్లినట్టే భావించాల్సి ఉంటుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మొత్తానికి వల్లభనేని వంశీ పార్టీ మార్పు వ్యవహారంతో మరోసారి టీడీపీ వర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్పై చర్చ మొదలైనట్టు కనిపిస్తోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
October 27, 2019, 10:16 AM IST