Jr NTR ReEntry: టీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీపై చర్చ... బాబు తలూపడం వెనుక..

జూనియర్ ఎన్టీఆర్(ఫైల్ ఫొటో)

ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పల్లెపోరులో అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చామని ప్రతిపక్ష పార్టీ చెబుతున్నప్పటికీ.. టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న వాదన ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో...

  • Share this:
ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పల్లెపోరులో అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చామని ప్రతిపక్ష పార్టీ చెబుతున్నప్పటికీ.. టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న వాదన ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన నినాదాలే నిదర్శనం. కుప్పం పరిధిలోని గ్రామ పంచాయతీల్లో మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకున్న వైసీపీ టీడీపీ అధినేతకు సొంత నియోజకవర్గంలోనే ఊహించని షాకిచ్చింది. దీంతో.. కార్యకర్తల్లో అలుముకున్న నిస్తేజాన్ని పోగొట్టి వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి కుప్పంలో పర్యటించారు. ఈ పర్యటనలో చంద్రబాబుకు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఊహించని అనుభవం ఎదురైంది.

జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ప్రచారానికి రావాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. కేవలం డిమాండ్ మాత్రమే కాదు.. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతీ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనిపించాయి. గతంలో ఇంత ప్రముఖంగా జూనియర్ ఎన్టీఆర్‌ ఫొటోలను ఫ్లెక్సీలపై, బ్యానర్లపై కుప్పం టీడీపీ శ్రేణులు వినియోగించిన సందర్భాలు లేవు. ఈసారి మాత్రం.. చంద్రబాబు, లోకేష్, బాలయ్య ఫొటోలతో పాటు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను బ్యానర్లపై, ఫ్లెక్సీలపై ఏర్పాటు చేయడం ఆసక్తికర పరిణామం.

జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో.. మహాకూటమి తరపున జూనియర్ ఎన్టీఆర్ ఊరూరా పర్యటించి తనదైన శైలిలో ప్రసంగాలు దంచికొట్టారు. అద్భుతమైన వాగ్దాటితో ప్రత్యర్థులపై జూనియర్ ఎన్టీఆర్ విరుచుకుపడుతుంటే టీడీపీ శ్రేణులు ఉప్పొంగిపోయేవి. రాజకీయ ప్రసంగాల్లో జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనుమడని నిరూపించుకున్నాడు. అయితే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు కొంత డీలా పడ్డాయి. ఆ పార్టీ పరిస్థితి చెప్పుకోదగ్గ విధంగా లేని ప్రతీ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా తెరపైకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జూనియర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. జూనియర్ వస్తాడని కానీ, రాడని కాని సంకేతాలివ్వడం లేదు.

కుప్పం పర్యటనలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునేందుకు ఇంకా సమయం ఉందన్నట్టుగా చంద్రబాబు హావభావాలు స్పష్టం చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కార్యకర్తలు నినాదాలు చేసిన సందర్భంలో, ఆ నినాదాలు చంద్రబాబు చెవిన పడినప్పటికీ తలూపారే తప్ప ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీని ద్వారా ఇంకా ఆ సమయం రాలేదని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్టయింది. ఇదే టూర్‌ను ముగిస్తున్న సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జూనియర్ రీఎంట్రీ ఇప్పట్లో ఉండదని స్పష్టం చేశాయి. అవసరమైతే మళ్లీ మళ్లీ వస్తానని, లోకేష్ కూడా వస్తాడని చెప్పిన చంద్రబాబు ఎన్టీఆర్ కూడా వస్తాడని చెప్పకపోవడం గమనార్హం. టీడీపీ వారసత్వం ప్రస్తుతానికి లోకేష్‌దేనన్న స్పష్టతను కుప్పం సాక్షిగా చంద్రబాబు పార్టీ శ్రేణుల్లోకి పంపడం విశేషం. జమిలి ఎన్నికలు జరుగుతాయని బలంగా నమ్ముతున్న టీడీపీ అధినేత.. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ సమయంలో ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టాడు.
Published by:Sambasiva Reddy
First published: