జూనియర్ ఎన్టీఆర్‌కు జగన్ కీలక బాధ్యతలు?.. రేసులో పీవీ సింధు

సినీ హీరోగానే కాకుండా యువతకు రోల్ మోడల్ గా కూడా ఉన్న ఎన్టీఆర్ … గతంలో రాజకీయంగా టీడీపీకి ప్రచారం చేసినా.. ఆ తర్వాత టీడీపీని పట్టించుకోకపోవడంతో మిన్నకుండిపోయారు.

news18-telugu
Updated: July 21, 2019, 6:21 PM IST
జూనియర్ ఎన్టీఆర్‌కు జగన్ కీలక బాధ్యతలు?.. రేసులో పీవీ సింధు
జూనియర్ ఎన్టీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా జగన్ సర్కారు కొత్త బ్రాండ్ అంబాసిడర్ ను కూడా నియమించబోతోంది. ఇందుకోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు స్టార్ షట్లర్ పీవీ సింధు పేరు కూడా పరిశీలిస్తున్నారు. మంత్రి కొడాలి నానితో పాటు ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీ నేతలే కావడంతో వీరి నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు ఎన్టీఆర్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ షట్లర్ గా ఘనవిజయాలు అందుకున్న సింధు పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే రెండో పొడవైన తీరప్రాంతంతో పాటు పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇతర పర్యాటక స్ధలాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు గత ప్రయత్నాలు సీరియస్ గా దృష్టిపెట్టలేదు. దీంతో ఎన్ని వనరులు ఉన్నా... పర్యాటక రంగం ప్రత్యామ్నాయంగా మాత్రమే మిగిలిపోయింది. రాష్ట్రంలో తాజాగా అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు పర్యాటక రంగాన్ని తమ ప్రాధాన్య రంగాల జాబితాలో చేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా మ్యూజియాలు, పర్యాటక జోన్ల అభివృద్ధికి సత్వర ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యాటక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఈ దిశగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రాండ్ అంబాసిడర్ ఉంటే ఆ కిక్కే వేరు. పర్యాటక ప్రాంతాల్లో ప్రచార కర్తలతో చిత్రాలు రూపొందిస్తే అవి ప్రజల్లోకి మరింతగా వెళ్లే అవకాశం ఉంటుంది. సమాజాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉన్న సినీ నటులు లేదా క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న జగన్ సర్కారు... ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు, ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రి కొడాలి నాని ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. వీరిద్దరూ ఎన్టీఆర్ ను బ్రాండ్ అంబాసిడర్ పేరును ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.


సినీ హీరోగానే కాకుండా యువతకు రోల్ మోడల్ గా కూడా ఉన్న ఎన్టీఆర్ … గతంలో రాజకీయంగా టీడీపీకి ప్రచారం చేసినా.. ఆ తర్వాత టీడీపీని పట్టించుకోకపోవడంతో మిన్నకుండిపోయారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన సోదరి నందమూరి సుహాసిని పోటీ చేసినా ఆమెకు ఓటేయమని అడగడం మినహా ప్రచారంలోకి వెళ్లలేదు. దీంతో ఎన్టీఆర్ విషయంలో వైసీపీ నేతలు కూడా సానుకూలంగానే ఉన్నారు. దీంతో అన్నివిధాలుగానూ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ తగిన వ్యక్తిగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బ్యాడ్మింట్ లో అంతర్జాతీయంగా ఘనవిజయాలు అందుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధు పేరు కూడా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ జాబితాలో వినిపిస్తోంది. సింధు ఎంపిక ద్వారా రాష్ట్రంలో యువతను ఆకట్టుకోవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. సిందు తన అసాధారణ విజయాలతో ఇప్పటికే రోల్ మోడల్ గా మారింది. సింధు విజయాలపై పాఠ్యాంశాలను కూడా రూపొందించేందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింధును నియమించడం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచీ పర్యాటకులను సైతం రాష్ట్రానికి రప్పించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ లేదా సింధులో ఒకరు ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: July 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>