యడ్డీ సర్కారుకు జేడీఎస్ మద్దతిస్తుందా? క్లారిటీ ఇచ్చిన కుమారస్వామి

కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన యడ్యూరప్ప సర్కారుకు మద్దతివ్వాలని జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కుమారస్వామిపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్న కథనాలు వెలువడ్డాయి.

news18-telugu
Updated: July 28, 2019, 7:31 AM IST
యడ్డీ సర్కారుకు జేడీఎస్ మద్దతిస్తుందా? క్లారిటీ ఇచ్చిన కుమారస్వామి
కర్ణాటక సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న యడ్యూరప్ప
  • Share this:
కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ సర్కారుకు జేడీఎస్ వెలుపలి నుంచి మద్దతివ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ అధినేత కుమారస్వామిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ క్లారిటీ ఇచ్చారు. యడ్యూరప్ప ప్రభుత్వానికి జేడీఎస్ మద్దతిచ్చే ప్రసక్తే లేదని వారు స్పష్టంచేశారు. జేడీఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించనుందని దేవెగౌడ చెప్పారు. ‘ఓ ప్రాంతీయ పార్టీగా ప్రభుత్వాన్ని ఎక్కడ వ్యతిరేకించాలో అక్కడ వ్యతిరేకిస్తాం...యడ్యూరప్ప రాష్ట్రానికి ఏవైనా మంచి పనులు చేస్తే స్వాగతిస్తాం’ అని దేవెగౌడ అన్నారు.

కాగా బీజేపీకి జేడీఎస్ మద్దతిచ్చే అవకాశముందన్న కథనాలను తోసిపుచ్చుతూ కుమారస్వామి ఓ ట్వీట్ చేశారు. మా పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశముందన్న కథనాలు పూర్తిగా నిరాధారమైనవిగా పేర్కొన్నారు. ఇలాంటి పుకార్లను పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవద్దని ఆయన సూచించారు.

ఇదిలా ఉండగా స్పీకర్ పదవి నుంచి తప్పుకోవాలని కేఆర్ రమేశ్ కుమార్‌పై బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. లేనిపక్షంలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు తెలుస్తోంది. యడ్యూరప్ప సోమవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోనున్నారు. బల పరీక్ష ముగిసిన వెంటనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తనను తానుగా స్పీకర్ పదవికి రమేశ్ కుమార్ రాజీనామా చేయనిపక్షంలో...తాము అవిశ్వాస తీర్మానాన్ని పెడుతామని ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపారు.

15 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో జేడీఎస్-కాంగ్రెస్ సర్కారు మైనార్టీలో పడిపోయింది. గత మంగళవారం అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో కుమారస్వామి సర్కారు కూలిపోవడం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర సీఎంగా యడ్యూరప్ప నాలుగోసారి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.

First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>