JD Lakshmi Narayana: రాజకీయం వదిలి రైతుగా మారిన జేడీ.. 12 ఎకరాలు కౌలుకు.. ఎందుకో తెలుసా..?

రైతుగా మారిన జేడీ లక్ష్మి నారాయణ

ఆయన చేతులతో ఎంతో మంది జీవితాలను మార్చారు.. అక్రమాలను అరికట్టారు.. కొమ్ములు తిరిగిన వారిని కూడా కటకటాల్లోకి పంపారు. తరువాత రాజకీయం బాణం ఎక్కు పెట్టారు. అయినా అది ఆనందాన్ని ఇవ్వలేదు. దీంతో వ్యవసాయ దారుడిగా మారారు. ఎందుకో తెలుసా..?

 • Share this:
  ఆ చేతులతో ఎంతో మంది అక్రమార్కుల ఆట కట్టించారు. ఆ చేతులతోనే ఎంతో మందిచే ఆదర్శపాఠాలు దిద్దించారు. ఇప్పుడు అదే చేతులతో తన జీవితంలో సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు. ఆయనే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. రాజకీయాలను పక్కన పెట్టిన లక్ష్మీనారాయణ సరికొత్త జీవితం ప్రారంభించారు. సీబీఐకి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసిన లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యమ సమయంలో మళ్లీ యాక్టివ్ అయినట్టు కనిపించారు. గంటా శ్రీనివసరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారితో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మరోవైపు న్యాయ పోరాటం కూడా కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన మరొ కొత్త రంగాన్ని ఎంచుకున్ని తొలి అడుగు వేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. నాగలి పట్టి రైతుగా మారారు. ఎడ్ల నాగలితో దుక్కి దున్ని వ్యవసాయ పనులు మొదలు పెట్టారు లక్ష్మినారాయణ.

  ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో 12 ఎకరాల పొలాన్ని ఆయన కౌలుకు తీసుకున్నారు. రైతులు ఎంతో సెంటిమెంట్ గా భావించే ఏరువాక పౌర్ణమి కావడంతో గురువారం వ్యవసాయ పనులను ప్రారంభించారు. నాగలి పట్టి ఉత్సాహంగా పొలం దున్నారు సీబీఐ మాజీ జేడీ. ఎన్నో క్లిష్టతరమైన కేసులను ఛేదించిన లక్ష్మినారాయణ.. సాగు పనులను కూడా ఈజీగానే చేసేస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభించిన సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. కరోనా కాలంలో మన దేశంలో వ్యవసాయ రంగం మాత్రమే ముందుకు వెళ్లగలిగిందని చెప్పారు. గత ఏడాది దేశ వ్యవసాయరంగంలో 3.6 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు.

  ఇదీ చదవండి: ఏపీలో ఆగష్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు.. దరఖాస్తుకు ఆఖరి తేదీ ఎప్పుడంటే..

  రైతన్నల వల్లే దేశంలో గోడౌన్లు ఆహార ధాన్యాలతో నిండిపోయాయని లక్ష్మినారాయణ చెప్పారు. తాను వ్యయం చేస్తూ సాయం చేసేవాడు వ్యవసాయదారుడు అని అన్నదాతలను కీర్తించారు. వ్యవసాయంలో ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నానని చెప్పారు. తన అనుభవం ద్వారా వ్యవసాయంలో రావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తానని తెలిపారు, పురుగుల మందులు చల్లడంలో డ్రోన్ల టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి రావాలని లక్ష్మీనారాయణ అభిలషించారు. జేడీ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంత పెద్ద ఆఫీసర్ అయ్యి ఉంది.. ఖాళీ కూర్చుని ఉండాల్సిన సమయంలోనూ ఇలా రైతుగా మారడం గ్రేట్ అంటున్నారు. జేడీని ఆదర్శంగా తీసుకుని అవకాశం ఉన్నవారంతా రైతులుగా మారాలని కోరుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: