Janasena: జనసేనకు గుడ్ న్యూస్.. మళ్లీ జై కొట్టేందుకు సిద్ధమైన నేత.. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా ?

పవన్ కళ్యాణ్ (File)

JD Lakshi Narayana: జనసేనలో ఉంటూ తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడానికి లక్ష్మీనారాయణ ప్రయత్నించారనే అసంతృప్తి కూడా ఆ పార్టీలో ఉంది. అప్పట్లో లక్ష్మీనారాయణను జనసేన పక్కనపెట్టడానికి ఇది కూడా ఓ కారణమే అని చెబుతుంటారు.

  • Share this:
    ఏపీలో జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుందనే అంశంపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో జనసేన కొంతమేర ప్రభావం చూపడంతో.. జనసేన శ్రేణులు, రాజకీయవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం ఉంటుందనే విషయాన్ని అంగీకరిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మరింతగా దృష్టి పెడితే... రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నాటికి జనసేన మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే గతంలో జనసేనను వీడిన మాజీ ఐపీఎస్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు.. జనసేనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ.. పంచాయతీ ఎన్నికల్లో జనసేన సాధించిన ఫలితాల పట్ల పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు... మళ్లీ జనసేనలోకి వెళతారా అన్న ప్రశ్నకు కూడా ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది.

    పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే మళ్లీ జనసేనలోకి వెళతానని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తమ పార్టీని వీడిన నేత.. మళ్లీ తమ పార్టీలోకి వస్తానని ప్రకటించడం జనసేనకు కలిసొచ్చే అంశం. ఇక గతేడాది జనవరిలో పవన్ కళ్యాణ్‌తో విభేదించి జనసేన నుంచి బయటకు వచ్చేశారు లక్ష్మీనారాయణ. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడైన పవన్‌ కల్యాణ్‌ విధి విధానాలు నచ్చకనే రాజీనామా చేస్తున్నట్టు అప్పట్లో వెల్లడించారు. పూర్తి జీవితం రాజకీయాలకే అని చెప్పిన పవన్.. తిరిగి సినిమాల్లో నటిస్తుండడం చూస్తుంటే .. ఆయనలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోందని జనసేనకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అందుకే జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని అనుకుంటున్నానని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడాన్ని తప్పుబడుతూ జనసేన నుంచి బయటకు వెళ్లిన లక్ష్మీనారాయణ.. ఒకవేళ మళ్లీ ఆ పార్టీలోకి వెళితే... సినిమాల్లో మళ్లీ నటించాలనే పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని సమర్థించాల్సి ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు.

    అయితే జనసేనలో ఉంటూ తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడానికి లక్ష్మీనారాయణ ప్రయత్నించారనే అసంతృప్తి కూడా ఆ పార్టీలో ఉంది. అప్పట్లో లక్ష్మీనారాయణను జనసేన పక్కనపెట్టడానికి ఇది కూడా ఓ కారణమే అని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మళ్లీ జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించిన లక్ష్మీనారాయణను.. పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తారా లేక ఆయనను లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: