JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు.. సీఎం జగన్‌కు ఆ రకంగా షాక్ ఇస్తారా ?

వైఎస్ జగన్, జేసీ ప్రభాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఒకప్పుడు వైఎస్ఆర్ కేబినెట్‌, ఆ తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో కీలక శాఖలను నిర్వహించిన మాజీమంత్రి రఘువీరారెడ్డి.. ఆ తరువాత రాష్ట్ర విభజనతో సైలెంట్ అయిపోయారు.

 • Share this:
  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. నేతల మాత్రం విభేదాలు కూడా శాశ్వతంగా ఉండవు. ఈ విషయం చాలామంది నేతలు రుజువు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. గతంలో తాము దూరంగా ఉన్న నేత సొంత ఊరికి వెళ్లి మరీ ఆయనతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకప్పుడు వైఎస్ఆర్ కేబినెట్‌, ఆ తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో కీలక శాఖలను నిర్వహించిన మాజీమంత్రి రఘువీరారెడ్డి.. ఆ తరువాత రాష్ట్ర విభజనతో సైలెంట్ అయిపోయారు.

  కాంగ్రెస్ పార్టీ తన ప్రభావం కోల్పోయినప్పటికీ.. అందులోనే కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆయన వైసీపీలోకి వెళతారనే ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. దీనిపై ఆయన మాత్రం స్పందించలేదు. ఇదే సమయంలో ఉన్నట్టుండి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, అనంతపురం టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి రఘువీరారెడ్డి కలిశారు. అది కూడా ఆయన సొంతూరికి వెళ్లి. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం రాజకీయం చేస్తున్నారనే దానిపై చర్చ మొదలైంది.

  రఘువీరారెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి


  అనంతపురం జిల్లాలో టీడీపీని బలోపేతం చేసేందుకు రఘువీరారెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. ఆయన వైసీపీ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో ఆయన నేరుగా చంద్రబాబుతోనే చర్చలు జరుపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

  సీఎం జగన్‌కు షాక్ ఇచ్చేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టయిల్లో మంత్రాంగం నడిపిస్తున్నారని.. ఈ క్రమంలోనే రఘువీరారెడ్డిని ఆయన సొంతూరికి వెళ్లి కలిశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని.. రాయలసీమకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుంటే సీనియర్ నేతలు మౌనంగా ఉండటం మంచిదికాదనే ఉద్ధేశ్యంతోనే రఘువీరారెడ్డిని కలిశానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. అయితే పైకి ఏం చెప్పినా.. ఆయన రఘువీరారెడ్డి విషయంలో సీఎం జగన్‌కు షాక్ ఇచ్చేలా వ్యవహరించాలనే వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: