తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీద మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిష్టూరం ఆడారు. అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఇంకా చంద్రబాబు అదే వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఏదైనా సూటిగా సుత్తిలేకుండా డైరెక్టుగా చెప్పకుండా గంటల తరబడి సాగదీయడం చంద్రబాబుకు అలవాటని, అది మార్చుకుంటేనే టీడీపీ బాగు పడుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే అధికారులతో సమీక్షలు, చర్చల పేరుతో సమయం వృధా చేసేవారని జేసీ అన్నారు. ఇప్పటికీ ఆ పద్ధతి మారలేదన్నారు. పది నిమిషాల్లో ముగించే ప్రసంగాన్ని వంద నిమిషాలు చేస్తున్నారని, ఇలా టైమ్ వేస్తున్నారని మండిపడ్డారు. తనను కలిసేందుకు ఎవరైనా వస్తే వారి యోగక్షేమాలు, కుటుంబం బాగోగుల గురించి చంద్రబాబు ఏ రోజూ అడగలేదని జేసీ అన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి వాళ్లను ఎవరైనా కలవడానికి వెళితే వారు భుజంపై చెయ్యేసి కుటుంబం వివరాలు, యోగక్షేమాలు, ఆరోగ్యం బాగోగులు అన్ని తెలుసుకుని ఆ తర్వాత ఏ పని మీద వచ్చారనే విషయాన్ని అడిగేవారని జేసీ అన్నారు. అలాంటి అలవాటు చంద్రబాబు వద్ద అసలు తాను ఎప్పుడూ చూడలేదని జేసీ నిష్టూరమాడారు. ఎవరైనా వస్తే ఆయనకు నచ్చితే పలకరిస్తారని, నచ్చకపోతే వెళ్లిపోతారని ఆరోపించారు.
ఈ విషయం తాను చంద్రబాబుకు కూడా చాలా సార్లు వ్యక్తిగతంగా, బహిరంగంగానే చెప్పానని జేసీ అన్నారు. అయినా ఇంకా ఆయనలో మార్పు రాలేదన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు అత్యంత సీనియర్ అని, అయినా ఆయన ఇప్పటికీ తన వైఖరి మార్చుకోలేదని.. ఆయనలో ముందు ముందు మార్పు వస్తుందన్న నమ్మకం లేదని ఓ ఇంటర్యూలో జేసీ కామెంట్ చేశారు. అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పటికైనా మారకుంటే.. మళ్లీ జగన్ చేతిలో చావు దెబ్బ తినక తప్పదని దివాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోని అందరి మనసులోనూ ఇదే మాట ఉందని జేసీ అన్నారు. అయితే తాను మాత్రం బయటకు చెబుతున్నానని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్న జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నానన్నారు.
చంద్రబాబు ఒక్కరే సీనియర్, మిగిలిన వాళ్లంతా చిన్నపిల్లలు అనే తీరులో టీడీపీ అధినేత ప్రవర్తిస్తుంటారని జేసీ అన్నారు. ఆయన సీనియర్ అయినా కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్న తమను కూడా ఇంకా పిల్లలే అనుకుంటే ఎలా అంటూ మాజీ ఎంపీ నిష్టూరమాడారు. ఈ అలవాటు చంద్రబాబు ఎంత త్వరగా మార్చుకుంటే.. పార్టీకి అంత మంచి జరుగుతుందని జేసీ స్పష్టం చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 16, 2021, 22:35 IST