ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ఒక్క రోజు ఆదాయం రూ.300 కోట్లు అని ఆరోపించారు. అయితే ఈ విషయంలో వాస్తవం ఎంతో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రజల్లో ఎక్కువగా ప్రచారం జరుగుతోందని కామెంట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చూసి ప్రజలు వైసీపీకి ఓటేశారని చెప్పడం అబద్ధమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అవన్నీ వైసీపీ నేతల దొంగ మాటలని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు లేనిదే ఎన్నికల్లో ఎవరూ గెలవలేరని అన్నారు. చాలామంది డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారని చెప్పారు.
దేశంలో రాజకీయాలు కలుషితం అయ్యాయని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేస్తారనుకుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారన్న జేసీ.. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారని అన్నారు. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఈ కారణంగానే చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ ఓడిపోయిందని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:February 23, 2021, 14:18 IST