JANGAON TRS MLA MUTHIREDDY YADAGIRI REDDY SENSATIONAL COMMENTS ON MINISTER POSTS SK
Telangana: కొత్త వారికే మంత్రి పదవులు.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Image-Facebook)
ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే తనకు వేదమని ముత్తిరెడ్డి అన్నారు. కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్‌గా ఉన్నా, మంత్రి పదవి రాలేదని అన్నారు. తన తర్వాత పార్టీలోకి వచ్చిన ఎంతో మందికి మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. గురువారం జనగామ నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కూడా హాజరయ్యారు. పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారని, సీనియారిటీ ఆధారంగా ప్రాధానత్య ఇవ్వాలని ఓ నాయకుడు అన్నారు. అనంతరం మాట్లాడిన ముత్తిరెడ్డి తాను చాలా ఏళ్లుగా పార్టీలో మంత్రి పదవి రాలేదని చెప్పారు. కార్యకర్తలు, నేతలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించి సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు.
''వర్ధన్నపేట, ఉప్పల్, జనగామ ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేశా. పార్టీ కోసం ఎంతో పనిచేశా. నేను టీఆర్ఎస్లో సీనియర్‌గా ఉన్నా. కానీ ఇంత వరకు మంత్రిని కాలేదు. నా తర్వాత పార్టీలోకి వచ్చిన చాలా మందికి మంత్రి పదవులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పార్టీకి విధేయుడిగా ఉంటూ నమ్మకంగా పని చేస్తూ వస్తున్నా.’' అని ఆయన పేర్కొన్నారు.
సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణలో టీఆర్ఎస్ ఉంటుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే తనకు వేదమని ఆయన అన్నారు. కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ వల్లే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని ఆయన అన్నారు. ముత్తిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి పదవి విషయంలో పార్టీ హైకమాండ్‌పై ఉన్న అసంతృప్తి ఇలా నర్మ గర్భంగా వ్యక్తపరిచారా? అని చర్చించుకుంటున్నారు.