ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టికి కూడా గట్టి షాక్ ఇచ్చాయి. ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. భీమవరంలో సుమారు 9వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉందనే వార్త వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఏదో తేడా జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు జనసేన కార్యకర్తల్లో నెలకొన్నాయి. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దంటూ ఆ పార్టీ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోల్ అయిన ఓట్లు, లెక్కించిన ఓట్లు సమానమేనని, ఏజెంట్లు ధ్రువీకరించినందున జనసైనికులు ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేయొద్దంటూ పిలుపునిచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.