ఆంధ్రప్రదేశ్ లో రైతు సమస్యలపై జనసేన పార్టీ ప్రత్యక్ష పోరాటంలోకి దిగబోతోంది. నివర్ తుఫాన్, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేరుగా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పిస్తానని పవన్ ప్రకటించారు. కౌలు రైతుకోసం భూమిదున్నే రైతు కోసమే జనసేన జైకిసాన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రైతుల కోసం పోరాడే అంశంపై మంగళవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అంతా నిర్లక్ష్యం
తుఫాన్ వల్ల ఐదు జిల్లాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఇంతవరకు వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ ఏడాది మే నుంచి నవంబర్ వరకు సంభవించిన ప్రకృతి వైపరిత్యాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 19.85లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే ప్రభుత్వం మాత్రం తప్పుడులెక్కలు చెబుతోందని మండిపడ్డారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.35వేలు నష్టపరిహారం చెల్లించాలని.. తక్షణ సాయం కింద రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారంపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందన్నారు. రైతుల సర్వస్వం కోల్పోయి రోడ్డున పడుతుంటే ప్రభుత్వం రైతు బీమా పేరుతో అంకెల గారడీ చేస్తోందన్నారు.
వారి కోసమే జై కిసాన్
రైతుల కోసం జై కిసాన్ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించిన పవన్ కల్యాణ్... ఈనెల మొదటివారంలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వం వెంటనే స్పదించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందులో భాగంగానే ఈ నెల 28న అన్ని కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తుఫాన్ నష్టాలను జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ సానుభూతి తెలిపారు. రైతు కష్టాన్ని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని పవన్ ధ్వజమెత్తారు.
పార్టీ బలోపేతంపై దృష్టి
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కల్యాణ్.. జై కిసాన్ ఉద్యమం ద్వారా పార్టీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో గతంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, సుగాలి ప్రీతి కేసుతో పాటు పలు అంశాలపై నిరసన కవాతులు నిర్వహించారు. కరోనా ప్రభావంతో కొన్నాళ్లు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పవన్ ఇటీవలే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులు, యువతతో భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించి ప్రతి సభ్యుడికి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా పవన్ కల్పించారు.
Published by:Purna Chandra
First published:December 15, 2020, 21:05 IST