వైసీపీ కొత్త వ్యూహం.. ఇరకాటంలో పడ్డ టీడీపీ, జనసేన

ఎన్డీయేలో వైసీపీ చేరబోతోందనే ప్రచారం పవన్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన మౌనంగా ఉండలేక తన మనసులో మాటను బయటపెట్టేశారు. వైసీపీ కనుక కేంద్రంలో చేరితే తాను బీజేపీకి గుడ్ బై చెబుతానంటూ ప్రకటించేశారు.

news18-telugu
Updated: February 17, 2020, 6:04 PM IST
వైసీపీ కొత్త వ్యూహం.. ఇరకాటంలో పడ్డ టీడీపీ, జనసేన
జగన్, చంద్రబాబు, పవన్
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ కరెస్పాండెంట్)

ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య బలపడుతున్న సంబంధాలు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానులకు ఉద్దేశించిన బిల్లులకు శాసనమండలిలో చుక్కెదురైన తర్వాత వేగంగా మారిన పరిణామాలు ఈ రెండు పార్టీలను ఆలోచనలో పడేస్తున్నాయి. దీంతో కేంద్రంతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న జనసేన, టీడీపీలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న ప్రచారం సాగుతోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసినా పరోక్షంగా టీడీపీ, జనసేన ఒకటే అన్న ప్రచారం వారిద్దరి కొంపముంచింది. వైసీపీకి వ్యతిరేకతే అజెండాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ 23 సీట్లకూ , జనసేన ఒక్క సీటుకూ పరిమితమయ్యాయి. గాజువాక, భీమవరంలో పోటీ చేసిన జనసేనాని పవన్ కు రెండు చోట్లా నిరాశ తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో పాటు మిగతా విపక్షాలను కూడదీసేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన టీడీపీ అధినేత చంద్రబాబు దారుణ ఫలితాల నేపథ్యంలో వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన ధర్మ పోరాటాన్ని మధ్యలోనే ఆపేసి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం తప్పిదమేనని అంగీకరించారు. ఆ తర్వాత ఎన్డీయేతో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు ఆరెస్సెస్ ద్వారా రాయబారాలు సాగించినట్లు ప్రచారం కూడా సాగింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి టీడీపీని చేరదీసేందుకు మోడీ-షా ద్వయం అంగీకరించలేదు. అంతటితో ఆగకుండా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన టీడీపీపై ఐటీ దాడుల రూపంలో కేంద్రం విరుచుకుపడుతోంది. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు టీడీపీకి చెందిన పలువురు యువ నేతల ఇళ్లపై సాగించిన ఐటీ దాడుల్లో భారీగా దస్త్రాల స్వాధీనంతో పాటు కీలక ఆధారాలను కూడా అధికారులు సేకరించారు. మొత్తం 2 వేల కోట్లకు పైగా నల్లధనం ఆనవాళ్లను వారు గుర్తించారు. త్వరలో దీనిపై మరింత లోతుగా శోధన చేపట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Vallabaneni vamsi, ap news, ap politics, tdp, ysrcp, janasena, ap cm ys jagan mohan reddy, chandrababu naidu, వల్లభనేని వంశీ, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, టీడీపీ, వైసీపీ, జనసేన, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు
వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు
టీడీపీ పరిస్ధితి ఇలా ఉంటే జనసేన పరిస్ధితి మరింత తీసికట్టుగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో కాస్తో కూస్తో గుర్తింపు ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా జనసేనను వీడిపోయారు. ఈ దశలో త్వరలో జనసేన కూడా ప్రజారాజ్యం బాటలో ఏదో ఒక పార్టీలో విలీనం కావడం తథ్యమని అంతా భావిస్తున్న తరుణంలో బీజేపీ పెద్దల్ని కలిసిన పవన్.. ఆ పార్టీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు సహా రాష్ట్రంలోని కీలక సమస్యలపై ఉద్యమించాలని ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఓ దశలో కేంద్రం జోక్యం చేసుకుని అమరావతి నుంచి రాజధాని తరలింపును ఆపేస్తుందని కూడా ఆయన పదేపదే చెప్పారు. కానీ చివరికి ఆ వ్యూహం కూడా బెడిసికొట్టింది. బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత రాజధాని వ్యవహారంలో కేంద్రం పేరును ప్రస్తావించొద్దన్న సూచనలు పవన్ కు అందాయి. దీంతో జనసేనాని పరిస్ధితి దారుణంగా మారింది. కేంద్రం పేరు ప్రస్తావించకుండానే వైసీపీని తిట్టాల్సిన పరిస్ధితి. అదే సమయంలో ఎన్డీయేలో వైసీపీ చేరబోతోందనే ప్రచారం పవన్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన మౌనంగా ఉండలేక తన మనసులో మాటను బయటపెట్టేశారు. వైసీపీ కనుక కేంద్రంలో చేరితే తాను బీజేపీకి గుడ్ బై చెబుతానంటూ ప్రకటించేశారు. పరిస్ధితి చూస్తుంటే కేంద్రంలో వైసీపీ చేరిపోవడం, బీజేపీకి జనసేన టాటా చెప్పేయడం ఖాయంగా కూడా కనిపిస్తోంది.

అదే జరిగితే వైసీపీ- బీజేపీకి వ్యతిరేకంగా పవన్ ఒంటరిగా పోరాడతారా లేక మళ్లీ టీడీపీ పంచన చేరతారా అన్న ప్రశ్నలు మొదలవుతాయి. ఇప్పటికే ఐటీ దాడులతో కేంద్రంపై గుర్రుగా ఉన్న టీడీపీతో పవన్ జత కట్టినా బీజేపీకి వ్యతిరేకంగా మరోసారి పోరాటం చేసే పరిస్ధితి వీరిద్దరికీ ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.
First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు