ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా కొన్నిపల్లెల్లో టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతోంది. అక్కడక్కడా పార్టీల మధ్య కొట్లాటలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన-వైసీపీ కార్యకర్తల మధ్య ఫైటింగ్ కొనసాగుతోంది. వీరవాసరం మండలం మత్యపురి గ్రామ సర్పంచ్ పదవిని జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారు. ఈక్రమంలో విజయోత్సవ ర్యాలీలో ఘర్షణలు జరగడంతో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రంధి కామెంట్స్ కు పవన్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమంటని.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. మున్సిపల్ వ్యాన్ వస్తోందంటూ మున్సిపాల్ ఎన్నికల్లో ఓడిస్తామంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకురౌడీ అని, కోపరేటివ్ బ్యాంకులో సొమ్ము దాచుకునే చిన్నచితకా శ్రమజీవులను దోచేసిన వ్యక్తి ఈ వైసీపీ ఎమ్మెల్యే అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇలాంటివాడు వేరే విధంగా ప్రవర్తిస్తాడని ఆశించలేమని వ్యాఖ్యానించారు. గ్రంధి శ్రీనివాస్ లాంటి వ్యక్తికి ఎలా సమాధానం చెప్పాలో తమకు బాగా తెలుసని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే చర్యలపై అనవసరంగా స్పందించవద్దన్న పవన్.. “పిచ్చికుక్క కరిస్తే తిరిగి కరవకూడదని.. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చేవరకు ఆగాలాన్నారు. త్వరలో మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది.. పిచ్చికుక్కని పట్టుకెళ్తుందని” ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్. మా వాళ్ల తప్పుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో సరిదిద్దుకుంటాం. అంతేతప్ప ఇళ్లపై దాడులు చేస్తుంటూ చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దని... ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని హెచ్చరించారు. భీమవరంలో గతంలోనూ శాంతిభద్రతలు దెబ్బతిన్నందున డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.
మత్స్యపురిలో జనసేన విజయాన్ని భరించలేని వైసిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మత్స్యపురి గ్రామపంచాయతీలో కారేపల్లి శాంతిప్రియ అనే మహిళ సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారని, విజయం అనంతరం అంబేద్కర్ విగ్రహానికి దండ వేయగా ఆ దండను వైసీపీ వాళ్లు తొలగించి ఆమెను దుర్భాషలాడారని, ఆమె ఇంటిపైనా దాడి చేశారని పవన్ వెల్లడించారు. అంతేకాకుండా అనంతలక్ష్మి అనే మత్స్యకార మహిళ ఇంటిపైనా దాడులు చేశారని తెలిపారు. వైసీపీకి చెందిన 151 ఎమ్మెల్యేలంతా ఎదుటివాళ్లను హింసించడంపైనే దృష్టి పెడుతున్నారని, వారి డీఎన్ఏ అలా ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే సభ్య సమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడుతున్నాడు. పైగా వ్యక్తిగతంగా నన్ను దూషిస్తున్నాడని పవన్ వెల్లడించారు. వారి పీఠం కదులుతుండటంతో కలిగిన భయం వల్లే వైసీపీ నేతల ఈ విధమైన బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.