JANASENA PARTY CHIEF PAWAN KALYAN HEADS TO DELHI TO DISCUSS ABOUT VIZAG STEEL PLANT ISSUE WITH BJP NATIONAL PRESIDETN JP NADDA HERE ARE THE DETAILS PRN
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. ప్రైవేటీకరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పవన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని ఇటీవల ప్రకటించిన పవన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ తో పాటు జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకమని ప్రకటించింది. కానీ పొత్తుధర్మం కారణంగా నిరసనల్లో పాల్గొనలేదు.
తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని జనసేన ప్రకటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన దాదాపు లక్షమందికి తాము అండగా ఉంటామని జనసేన ప్రకటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఏపీ ప్రజలకు ఉన్న బంధం, ప్రైవేటీకరణ చేస్తే పరిశ్రమపై ఆధారపడ్డ వారిపై చూపే ప్రభావం తదితర అంశాలను పవన్ కల్యాణ్.. నడ్డా దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ పవన్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలోనే ఉండటంతో ఈ విషయంలో పవన్ చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సొంత నియోజకవర్గంలోని సమస్య కావడంతో ఈ నిర్ణయాన్ని అమలు చేయవద్దని గట్టిగా కోరే అవకాశముంది.
మరోవైపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిని ఖరారు చేసే అంశం కూడా పవన్ కల్యాణ్.. జేపీ నడ్డాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి విషయంలో పవన్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.