ఆంధ్రప్రదేశ్ లో జనసేన – బీజేపీ పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో గ్యాప్ వచ్చిన మాట నిజమేనని అంగీకరించారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికపైనా పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తిరుపతిలో పోటీ చేయాలని జనసేన బలంగా నిర్ణయించుకుందన్నారు. అలాగే బీజేపీ నాయకులు తమను చిన్నచూపు చూస్తున్నారన్న మాటలను తాను కూడా విన్నానన్న పవన్.., రెండు పార్టీల మధ్య ముఖాముఖీ సమావేశాలు జరగకపోవడం వల్లే గ్యాప్ వచ్చిందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో తిరుపతిలో ఎవరు పోటీ చేస్తారో ఫైనల్ చేస్తామన్నారు. ఎవరు పోటీ చేసినా ..జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప బలంగా ముందుకెళ్లలేమని స్పష్టం చేసారు.
తిరుపతిలో గెలుపు ద్వారా రెండు పార్టీల పొత్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. జనసేన పార్టీ పోటీ చేస్తే తానే నేరుగా ప్రచారానికి వస్తానని.., బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే జాతీయ స్థాయి నేతలు రావాలన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగాలని పిలుపునిచ్చారు. ఇక తిరుపతి అభ్యర్థిపై బీజేపీ నేతల ముందస్తు ప్రకటనలపై స్పందించిన పవన్.., సభల్లో జనాన్ని ఉత్సాహపరచడానికి అలా ప్రకటించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
చూస్తూ ఊరుకోం..
ఇక రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకాలు మితిమీరుతున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన..,అధికార పార్టీపై మండిపడ్డారు. హిందూ ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన పవన్.., దేవుడి చేయి విరిగితే ఏమవుతుంది..? రథం దగ్ధమైతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటని మంత్రులు మాట్లాడితే చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఇతర మతాలపై దాడులు జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడతారని.. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే పట్టించుకోరన్నారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకే రోజు కాకుండా.. రాజకీయ నాయకుల కోసం 10రోజులు ద్వారా ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. ఆలయాల్లో అన్నీ పద్ధతి ప్రకారం జరగాలన్నారు. రాష్ట్రంలోని 12 ప్రముఖ దేవాలయాలపై పరిశీలనకు జనసేన ఆధ్వర్యంలో షాడో కమిటీలు వేస్తామని ప్రకటించారు.
అందుకే రామతీర్థం వెళ్లలేదు..
రామతీర్థం ఆలయాన్ని సందర్శించకపోవడంపై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. తాను రామతీర్థం వెళ్తే భావోద్వేగాలు ఎక్కువవుతాయని.., అనుకోని సంఘటన జరిగితే అమయాకులు బలయ్యే ప్రమాదముందన్నారు. బైబిల్ పార్టీ కావాలా..? భగవద్గీత పార్టీ కావాలా..? అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పవన్.., వైసీపీ నిర్లక్ష్యాన్ని చూసిన ఆవేదనతోనే అలా మాట్లాడి ఉంటారన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మతంతో ముడిపెట్టడం సరికాదన్న పవన్.., అలాంటి రాజకీయాలకు తాము దూరమని ప్రకటించారు. ఈ సందర్భంగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పవన్ విరాళం ఇచ్చారు. మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కు చెక్కు అందజేశారు.