news18-telugu
Updated: November 22, 2020, 2:27 PM IST
జనసేన
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆ పార్టీ తెలంగాణ విభాగం ఖండించింది. పవన్ కల్యాణ్‌పై టీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, నిరంజన్‌రెడ్డిలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జనసేన తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. బాల్క సుమన్, నిరంజన్‌రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తమ నాయకుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రక్రియలో "జీరో బడ్జెట్ పాలిటిక్స్" తీసుకురావాలనే ఆశయంతో ముందకెళ్లి 20 లక్షలకు పైగా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారని చెప్పారు. తమ సహచర పార్టీలోని నాయకుల్లాగా వందల కోట్లతో ప్రచార ఆర్భాటాలు, డబ్బులు, మద్యం, బిర్యానీలు పంచి రాజకీయాలు చేయలేదని చెప్పారు. తమ ఓటమిలో కూడా నిజాయితీ ఉందనే విషయాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కూడా వారికి లేదన్నారు.
వాళ్ల నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ఒక్క రూపాయి కూడా పంచకుండా ఎన్నికల్లో గెలిచి చూపించాలని తాను సవాలు విసురుతున్నానని చెప్పారు. డబ్బులు పెట్టకుండా ఒక్క డివిజన్లో కూడా గెలవలేని మీరు ఉన్నత విలువలతో ఉన్న తమ నాయకుడిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నోరు అదుపులోకి పెట్టుకోకపోతే జనసైనికులు అంతా తిరగబడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ వరదల్లో చిక్కుకుపోయి ప్రజలు కష్టాలు పడినప్పడు ఈ నాయకులంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 ఏళ్లు గడచినా జీహెచ్ఎంసీ డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయలని టీఆర్ఎస్ ప్రభుత్వం.. పరోక్షంగా వరదలకు కారణం కదా అని నిలదీశారు.
పవన్ కల్యాణ్ తన కష్టార్జితం నుంచి వరద సహాయం కోసం కోటి రూపాయలను, కరోనాతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకను ఆదుకోవడానికి 50 లక్షల రూపాయలను విరాళంగా ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చారని తెలిపారు. ప్రజాప్రతినిధులుగా గెలిచిన బాల్కసుమన్, నిరంజన్‌రెడ్డి ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఒక్క రూపాయి ప్రజల కోసం ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల్లోఓడిపోయిన తమ నాయకుడు కోట్ల రూపాయలు దానం చేస్తున్నారని.. ఇది చూస్తే నిజమైన నాయకుడు ఎవరో అర్థం అవుతుందన్నారు. వరద సాయాన్ని తోటి నాయకులతో కలిసి దోచుకున్న మాట వాస్తవం కాదా అని నిలదీస్తున్నారు.
రాజకీయాలు చేయాలంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకొచ్చి వారి దమ్ముని నిరూపించుకోవాలని సవాలు విసిరారు. మరోసారి ఇదే విధంగా నోరు జారితే వారి అసమర్ధతను మొత్తం ప్రజల ముందు బయటపెడతామని హెచ్చరించారు. ఇక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జససేన మద్దతు తెలుపుతున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ నేతలు, పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురైనా కూడా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 22, 2020, 2:27 PM IST