జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena chief Pawan kalyan) చాన్నాళ్ల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాన్నాళ్ల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. పలు అంశాలపై నేతలతో చర్చించారు. అలాగే నిరుద్యోగ సమస్యతో పాటు ఇతర ప్రజాసమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలోనే పేదల ఇళ్లను తొలగిస్తున్నారంటూ స్థానికులు పవను ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ అంశంపై మాట్లానిన పవన్.. ముఖ్యమంత్రి పేదలకు న్యాయం చేసుకుండా ఇళ్లు తొలగించడం సరికాదన్నారు. నిజంగా సీఎంకు భద్రతా ఏర్పాట్లు, ఇతర అవసరాల కోసం ఇళ్లు తొలగించాల్సి వస్తే వారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. మూడున్నర దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నవారిని ఉన్నఫళంగా వెళ్లిపోమంటే చూస్తూ ఊరుకునేది లేదని పవన్ స్పష్టంచేశారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకుంటే సీఎం నివాసం వద్దే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పేదలకు ఇళ్లు నిర్మించాల్సింది పోయి వారి ఇళ్లు కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అంతకుముందు పవన్ కరోనాతో మృతి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలకు నివాళులర్పించారు. పలువు కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కులను అందించారు. జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని.. అందుకే వారి కోసం బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. తన వంతు సాయంతో కోటి రూపాయలను బీమా పథకానికి విరాళమిచ్చినట్లు పవన్ తెలిపారు. అభిమానులు, కార్యకర్తల అండతోనే పార్టీ నిలబడిందని పవన్ కల్యాణ్ అన్నారు.
నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ సమస్యలపై పోరాడాలంటూ పవన్ కల్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ నిరుద్యోగ సమస్యపై పార్టీ దృష్టిపెడుతుందని ప్రభుత్వంతో పోరాడుతుందన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం గతంలో లాంగ్ మార్చ్ చేయగా ప్రభుత్వం స్పందించిందన్నారు. ఐతే వారికి మరింత న్యాయం జరిగేలా పోరాడతానని పవన్ హామీ ఇచ్చారు.
కరోనా కారణంగా మూడు నెలల పాటు ప్రజాజీవితానికి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్... బుధవారం విజయవాడ వచ్చారు. పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, కొవిడ్ నియంత్రణ, జాబ్ క్యాలెండర్, ప్రజాసమస్యలపై ప్రధానంగా చర్చించారు. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయి బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. పవన్ పర్యటన సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.