JANASENA CHIEF PAWAN KALYAN TO PARTICIPATE TIRUPATI BY POLL CAMPAIGN AND BJP LEADERS MADE ARRANGEMENTS FULL DETAILS HERE PRN
Tirupati By Poll : రంగంలోకి దిగుతున్న జనసేనాని.. తిరుపతిలో పవన్ పర్యటన ఫిక్స్
పవన్ కల్యాణ్ (ఫైల్)
జనసేన-బీజేపీ పొత్తుపై (Janasena-BJP Alliance) ఉన్న అనుమానాలకు చెక్ పెట్టేందుకు రెండు పార్టీలు యత్నిస్తున్నాయి. తిరుపతి ఉపఎన్నిక (Tirupati By poll) సాక్షిగా విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉపఎన్నికపై (Tirupati By Poll) అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గెలుపుకోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో గట్టిపోటీ ఇచ్చేందుకు జనసేన-బీజేపీ కూటమి (Janasena-BJP Alliance) కూడా పావులు కదుపుతోంది. ఇప్పటికే రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభతో పాటు ముఖ్యనేతలంతా తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగబోతున్నారు. ఏప్రిల్ 3న పవన్ కల్యాణ్ తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభకి మద్దతుగా తిరుపతి నగరంలోని ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. పవన్ రాకతో తిరుపతి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. పవన్ పర్యటన అటు జనసైనికుల్లోనూ జోష్ నింపనుంది. జనసేనాని టూర్ తమకు కలిసొస్తుందని బీజేపీ కూడా భావిస్తోంది.
ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా పవన్ కల్యాణ్ పాదయాత్ర ఉంటుందని జనసేన నేతలు చెప్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం మూడు గంటలకు పవన్ ప్రచారం ప్రారంభమవుతుంది.., పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు.
పవన్ కల్యాణ్ పర్యటనను విజయవంతం చేసేందుకు జనసేనతో పాటు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించారు. పవన్ పర్యటనతో బీజేపీ, జనసేన పొత్తుపై అనేక అనుమానాలు తొలగిపోతాయని మనోహర్ అన్నారు. తమ పొత్తుపై అపోహలు, అసత్యాలు సృష్టించి ప్రత్యర్థులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
దౌర్జన్యాలు చేస్తే తిరగబడతాం
జనసేన పార్టీ సానుభూతిపరులను స్థానిక అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని మనోహర్ తెలిపారు. ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులను, వ్యాపారస్థులను పిలుపించుకొని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపారాలు చేయనివ్వమని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని.. ఎన్నికలు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి కానీ, ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం తప్పకుండా తిరగబడతామని హెచ్చరించారు.
ప్రజాప్రతినిధులు ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వారు వెంటనే క్షమాపణ చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ప్రజలను కులాలు, మతాలుగా విభజించి అధికార పార్టీ గెలవాలని చూస్తుందన్నారు. వైసీపీకి నిజంగా బలం ఉంటే నిజాయతీగా పోరాడాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మండలానికో ఎమ్మెల్యే, నియోజకవర్గానికో మంత్రిని పర్యవేక్షకుడిగా నియమిస్తున్నారని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్నా బడ్జెట్ సమావేశాలు పెట్టలేకపోయారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.