ఆంధ్రప్రదేశం పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులను వైసీపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని.. వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీకి జనసేన అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రోద్బలంతో ఏకగ్రీవాలు జరుగుతున్నాయని.. పల్లెల్లోని ప్రజలను బెదిరించి ఏకగ్రీవాలు చేయడం సరికాదన్నారు. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య పోటీ జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని పవన్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం జనసేన బలంగా పోరాటం చేస్తుందని.. జనసైనికులే అధికార పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.
పెరిగిన ఓటింగ్
ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించిందని పవన్ కల్యాణ్ అన్నారు. తొలి విడతలో జనసేను 18శాతం ఓట్లు వస్తే.. రెండో విడతలో 22శాతం ఓట్లు వచ్చాయన్నారు. 250కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారని... 1500 పంచాయతీల్లో రెండోస్థానం వచ్చిందన్నారు. 1500 వార్డులు తమ పార్టీ ఖాతాలో చేరినట్లు పవన్ వెల్లడించారు.
వైసీపీ బెదిరింపులు
ఇక జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్ లు తమ కిందే పనిచేస్తారంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. అలాగే పంచాయతీల్లో జనసేన మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తున్నారని.. ప్రలోభాలకు గురిచేసి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం దుర్మార్గమన్నారు. అలాగే అధికార పార్టీ మాట వినని వారిని కిడ్నాప్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైసీపీకి ఓట్లు వేయించాల్సిందిగా ఎమ్మెల్యేలు గ్రామ వాలంటీర్లపై ఒత్తిడి తెస్తున్నారని పవన్ ఆరోపించారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడాల్సిన అసరం లేదని.. ధైర్యంగా నిలబడి రాష్ట్రానికి కావాలిసిన మార్పును జనసేన తీసుకొస్తుందని జనసేనాని ధీమా వ్యక్తం చేశారు.
కేరళ తరహాలో
ఇక ఆంధ్రప్రదేశ్ లో కేరళ తరహాలో పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పంచాయతీలకు స్వయంగా నిర్ణయించుకునే హక్కు కల్పిస్తేనే స్థానికంగా ఉండే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కోసం జనసేన పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఎస్ఈసీ పునరాలోచించాలి
ఇక మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునరాలోచించుకోవాలని పవన్ కోరారు. షెడ్యూల్ ను రద్దు చేసి కొత్త షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీ అరాచకాలు సృష్టించాయాని.. వాటిపై గురించి కూడా ఆలోచించాలన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు వాటిని గౌరవించాలని.. ఎక్కడా కించపరిచే వ్యాఖ్యలు చేయవద్దని పవన్ పిలుపునిచ్చారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.