ఆ పని చేసి పెట్టండి.. సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి..

కరోనా నేపథ్యంలో నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి అవసరాలు తీర్చేలా నిత్యావసరాల సరుకులను ఇంటి వద్దకే తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు.

news18-telugu
Updated: March 27, 2020, 7:01 AM IST
ఆ పని చేసి పెట్టండి.. సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి..
పవన్ కళ్యాణ్, జగన్
  • Share this:
కరోనా నేపథ్యంలో నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి అవసరాలు తీర్చేలా నిత్యావసరాల సరుకులను ఇంటి వద్దకే తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌కు లేఖ రాశారు. ‘నిత్యావసరాల కోసం రైతు బజార్లు, కిరాణా దుకాణాల దగ్గర జనం ఇప్పటికీ క్యూ కడుతున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత ఉండదు. అన్నీ అందుబాటులోకి తీసుకువస్తామనే భరోసాను ఏపీ ప్రభుత్వం కల్పించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం బలంగా చెబుతున్నా... రైతు బజార్లలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోతే ఎలా? ప్రజల ముంగిటకే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకువెళ్తే రోడ్డు మీదకు జనం రావడం గణనీయంగా తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి’ అని జగన్‌ను పవన్ కోరారు.

అటు.. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వాళ్లు ఏపీ సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్నారని రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని పవన్ అన్నారు. ఏపీ సర్కారు చర్యలు చేపట్టి వారిని స్వస్థలాలకు పంపాలని కోరారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించాలని విజ్ఞప్తి చేశారు.

ఇక, ‘రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందిలో అందరికీ ఎన్-95 మాస్కులు అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షించే సిబ్బందితో పాటు సంబంధిత వైద్యులను ప్రభుత్వం పట్టించుకోవాలి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, రక్షణ దుస్తులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగంలో ఉన్నవారికీ వీటిని అందించడం అవసరం. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యతో పాటు వాటిలో శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యాన్ని పెంచాలి’’ అని సీఎంకు జనసేనాని సూచించారు.First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు