ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. పదవుల కోసం కాకుండా కేవలం ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను బరిలో నిలిపిందని, వారు గెలిస్తేనే చట్టసభల్లో ప్రజాగళం వినపడుతుందని పవన్ అన్నారు. జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన.. బీజేపీని వీడి తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకోబోతోందన్న ప్రచారానికి చెక్ పెడుతూ, కమలనాథులు తమ మిత్రులేనని పవన్ ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. వివరాలివి..
పదవులు కాదు.. ప్రజా సేవ కోసమే..
‘నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు 12 మున్సిపాలిటీలకు ఈనెల 15వ తేదీన నిర్వహించే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటితోపాటు మరికొన్ని పురపాలక, నగర పాలక సంస్థల్లో, ప్రజా పరిషత్తుల్లోనూ వచ్చిన ఉప ఎన్నికల్లో జనసేన పోటీలో నిలిచింది. ఒక మార్పు కోసం ఈ పోరాటం. జనసైనికులు పదవుల కోసం కాకుండా సేవ చేయడానికే ముందుంటారని ప్రజలకు తెలిసిన విషయమే.
పాతికేళ్ల భవిష్యత్తు కోసం
అన్ని వేళలా ప్రజల కోసం పని చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాం. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకున్న అభ్యర్థులు పోటీలో నిలిచారు. స్థానిక సంస్థలపై అవగాహనతో, సామాజక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకుంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుంది. మన బిడ్డలకు పాతికేళ్ల భవిష్యత్తు కోసం పరితపించే జనసేన అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రపక్షమైన బీజేపీని కూడా..
జనసేనతో మైత్రి ఉన్న బీజేపీ సైతం కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నది. మా మిత్రపక్షం బీజేపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరుతున్నాను. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, కుప్పం, దర్శి, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, మున్సిపాలిటీలతోపాటు విశాఖ, గుంటూరు, కార్పొరేషన్లు, రేపల్లె మున్సిపాలిటీలో ఉప ఎన్నికలు, పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న జనసేన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జగన్ ఈ అవకాశాన్ని వాడుకోవాలి..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతి వేదికగా ఆదివారం నాడు జరుగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు జనసేన కీలకసూచన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించడానికి సీఎంల జోనల్ కౌన్సిల్ మీటింగ్ ను జగన్ ఒక అవకాశంగా తీసుకోవాలని, తమిళనాడులోని సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు అక్కడి ప్రభుత్వం ఏం చేసిందో జగన్ అడిగి తెలుసుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సూచించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సమావేశం ఫొటోను మనోహర్ పోస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janasena, Muncipal elections, Pawan kalyan