news18-telugu
Updated: November 20, 2020, 3:51 PM IST
పవన్ కళ్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ కేడర్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. నిన్న (నవంబర్ 19) కూడా 27 మందితో కూడిన జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేస్తామంటూ ఆ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించారు. ఈ క్రమంలో ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఇద్దరూ పవన్ ఇంటికి వెళ్లి కలిశారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఎన్నికలపై చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. జనసేన పార్టీ నేతలు, పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురైనా కూడా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.
హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం, అలాగే, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదరలేదని రాబోయే ఎన్నికల్లో కలసి పని చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోదని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత నవంబర్ 19న జరిగిన ఓ మీడియా సమావేశంలో కూడా బండి సంజయ్ జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేశారు. అసలు జనసేన పార్టీతో పొత్తు అంశం బీజేపీలో చర్చకే రాలేదని.. అలాగే పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. ఈ క్రమంలో పవన్ కూడా తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపాలని ప్రయత్నించారు.
కానీ, సడన్‌గా ఎన్నికల నామినేషన్ చివరి రోజు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇద్దరూ పవన్ కళ్యాణ్‌ను కలసి చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారితో భేటీ తర్వాత పోటీ నుంచి జనసేన తప్పుకుంది. బీజేపీకి మద్దతు ప్రకటించింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 20, 2020, 3:33 PM IST