ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసి చాలా రోజులైంది. ప్రధాన పార్టీలన్ని తమ పంచాయతీల స్కోర్ ప్రకటిస్తున్నాయి. తాము మెజారిటీ స్థానాల్లో గెలిచామని వైఎస్ఆర్సీపీ చెప్తుంటే.. తెలుగుదేశం పార్టీ తమదే ఆధిపత్యమని వాదిస్తోంది. మరోవైపు జనసేన కూడా తము బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నమని ప్రకటించింది. ప్రజల్లో మార్పు మొదలైందంటూ పంచాయతీ ఎన్నికల లెక్కలు ప్రకటించింది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజలు జనసేన వైపు చూస్తున్నారని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 65శాతం పంచాయతీల్లో జనసేన ద్వితీయ స్థానంలో నిలిచిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇదే మార్పుకు సంకేమతన్నారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 1209 సర్పంచ్ పదవులు, 1776 ఉపసర్పంచ్ పదవులు, 4,456 వార్డు సభ్యులు జనసేన మద్దతుతో విజయం సాధించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 27శాతం ఓటింగ్ జనసేన పార్టీ మద్దతుదారులకు దక్కిందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల సొంత నియోజకవర్గాల్లో జనసేన మద్దతుతో గెలిచి ఇతర పార్టీల వారుగా ప్రచారం చేసుకున్నవారిని లెక్కలోకి తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. గుడివాడలో ఎమ్మెల్యేకి సంబంధించిన గ్రామంలో జనసేన మద్దతుదారు గెలిచినా వేరే పార్టీ ఖాతాలో వేసుకున్నారన్నారు. ఒక్క రూపాయి పంచకుండా.. దౌర్జన్యాలకు దిగకుండా జనసైనికులు విజయం సాధించారని చెప్పారు.
జనసేన మద్దతుదారులు గెలుపొందిన పంచాయతీల్లో కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించేలా ప్రయత్నిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నిధులొస్తున్నాయేగానీ.. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో విడుదల చేయడం లేదని పవన్ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రాన్ని దాటి ప్రజలకు చేరినట్లు, సత్ఫలితాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే నలిగిపోతున్నాయన్నారు పవన్.
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సమస్యలు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల కష్టాలు అడిగి తెలుసుకున్నామన్నారు. తిత్లీ తుఫాన్ సంభవించినప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెల్లో పర్యటించి సమస్యలు పరిశీలించామన్నారు. అలాగే ఉద్దానంలో కిడ్నీ వ్యాధి భయపడి ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నా... విజయనగం జిల్లా పెదపెంకిలో బోదకాలు వ్యాపిస్తున్నా స్థానిక ప్రజాప్రతినిథులుగానీ, పంచాయతీ వ్యవస్థలు గానీ ఏం చేస్తున్నాయని పవన్ ప్రశ్నించారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరి లెక్కలు వారు చెప్పుకుంటున్నారు.. పవన్ కూడా తమ పార్టీ లెక్కను ప్రకటించడంపై ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాలి. ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఈ లిస్టులో జనసేన కూడా జాయిన్ అయిందన్న టాక్ వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Ap local body elections, AP News, Gram Panchayat Elections, Janasena, Janasena party, Local body elections, Pavan kalyan, Pawan kalyan, TDP, Telugu news, Ysrcp