ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో వైఎస్ జగన్ (AP CM YS Jagan) ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. “రాష్ట్రంలో అప్పుడు అమ్మఒడి.. ఇప్పుడు అమ్మకానికో బడి” అమలవుతోందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను పవన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 2,200 ప్రైవేట్ స్కూళ్లు, 2 లక్షల మంది విద్యార్థులు, 6,700 మంది టీచర్లు, 182 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 71వేల మంది స్టూడెంట్స్, అలాగే 116 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, రెండున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తన నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేయడమే కాకుండా.. వారి కుటుంబాలను కూడా నాశనం చేస్తోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ సర్కార్ అనాలోచిత తీరు వల్ల విద్యార్థులు బలిపశువులయ్యారని మండిపడ్డారు. అసలు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎన్ని స్కూల్ మేనేజేమెంట్ కమిటీలు పనిచేస్తున్నాయా..? ప్రభుత్వ నిర్ణయంపై ఎన్ని ఎస్ఎంసీలు చర్చించాయి..? ఎస్ఎంసీలు లేని స్కూళ్లలో విలీన నిర్ణయాలకు విలువ ఉంటుందా..? ఇది ఆర్టీఈ సూత్రాలను ఉల్లంఘించినట్టు కాదా..? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
పాఠశాలలను విలీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుందో చెప్పాలని.., విద్యాసంవత్సరం మధ్యలో ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకోవడంలో అర్ధమేంటని పవన్ నిలదీశారు. ఎయిడెడ్ పాఠశాలలను సమస్యల నుంచి గట్టెక్కించాలంటే విలీనం చేసుకోవడమే మార్గమా..? అని ఆయన అన్నారు.
అంత అవసరం ఏమొచ్చింది..?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధుల మళ్లింపు అంశంపైనా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం వాటి నిధులను మళ్లించడం దురదృష్టకరణని అభిప్రాయపడ్డారు. హెల్త్ యూనివర్సిటీ దగ్గర రూ.450 కోట్లు ఉంటే.. రాష్ట్ర విభజన ప్రక్రియలో రూ.170 కోట్లు తెలంగాణకు వెళ్తాయని.. మిగిలిన నిధుల్లో రూ.250 కోట్లు ప్రభుత్వం తీసుకుంటే మిగిలేది రూ.30 కోట్లేనని.. ఈ నిధులతో యూనివర్సిటీలు ఏం సాధిస్తాయని పవన్ ప్రశ్నించారు. నిధులు మళ్లించాలని కీలక బాధ్యతల్లో ఉన్నవారే ప్రయత్నిస్తున్నారని.. అందుకే అత్యవసరంగా పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కేవలం రూ.250 కోట్ల కోసం ప్రభుత్వం ఎందుకంత ఆత్రుత పడుతుందో అర్థం కావడం లేదని.., ఈ నిధులను ఏ ప్రయోజనం కోసం ఖర్చు చేయాలనుకుంటున్నారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Janasena party, Pawan kalyan