అమరావతి కోసం ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విపక్ష నేతలు ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారు. సోమవారం అనంతపురంలో జరిగిన యాత్రలో చంద్రబాబు నాయుడు జోలెపట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో జేసీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని మూడు రాష్ట్రాలుగా విడగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కుల ద్వేషాన్ని, ప్రాంతీయతత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు జేసీ.
రాష్ట్రానికి రాజధాని అంటే.. అసెంబ్లీ, సెక్రటేరియెట్, హైకోర్టు ఒకే చోట ఉండాలని జేసీ స్పష్టం చేశారు. హైదరాబాద్లో సచివాలయం, శాసనసభ ఎలా ఉన్నాయో.. అమరావతిలోనూ అలాగే ఉండాలని చెప్పారు. కేవలం కులాన్ని, మతాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Ap capital, AP News, JC Diwakar Reddy