ఇక విశాఖ నుంచీ పాలన... ఉగాది నాడు ముహూర్తం

Andhra Pradesh : ఏపీలో ఏం జరుగుతుందన్నది కాదు... ఏం చెయ్యాలన్నదే ఫోకస్‌గా వైసీపీ ప్రభుత్వం పనులు చేసుకుపోతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా భావిస్తూ... ఉగాది నాడు అక్కడి నుంచీ పాలన చేపట్టేందుకు రెడీ అవుతోంది.

news18-telugu
Updated: January 28, 2020, 1:31 PM IST
ఇక విశాఖ నుంచీ పాలన... ఉగాది నాడు ముహూర్తం
ఇక విశాఖ నుంచీ పాలన... ఉగాది నాడు ముహూర్తం
  • Share this:
Andhra Pradesh : ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం... శాసన మండలి సెలక్ట్ కమిటీ చేతుల్లోకి వెళ్లడం, మండలి రద్దు కోసం కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపడం వంటి వరుస పరిణామాల మధ్య... సీఎం జగన్... నెక్ట్స్ ఏం చెయ్యబోతున్నారు, ఆయన అడుగులు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజా పరిణామాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లేందుకే సీఎం జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఉగాది నాటికి ముఖ్యమంత్రిగా తన కార్యకలాపాలను విశాఖపట్నంలో ప్రారంభించేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అప్పటిలోగా... అన్నీ సెట్ అవుతాయనీ, విశాఖ నుంచీ పాలించేందుకు ఉన్న అభ్యంతరాలన్నీ తొలగిపోతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారాన్ని న్యాయ, కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్న జగన్ సర్కారు... ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం లేకుండానే నెక్ట్స్ అడుగులు వేస్తోంది. ఈ దిశగా రాజ్యాంగంలోని నిబంధనల్ని పరిశీలిస్తున్న న్యాయ విభాగం సలహాతో ముఖ్యమంత్రి... రాజధానితో సంబంధం లేకుండా ఉగాది నాడు తన కార్యకలాపాలను విశాఖ నుంచి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు సీఎంవోనూ విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ సమావేశాల్లో మాట్లాడిన జగన్... రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదని, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయని చెప్పారు. దీని వెనుక మాజీ అటార్నీ జనరల్, ప్రస్తుతం రాజధాని కేసులను వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సూచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే రాష్ట్రంలో రాజధాని మార్పుకు సభలో బిల్లులు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని రోహత్గీ ఇచ్చిన సలహాతో జగన్... విశాఖకు తన కార్యాలయం మార్పేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు సీఎంవో కోసం ఇప్పటికే అధికారులు తగిన భవనాలు గుర్తించారు. వీటిలో సీఎం జగన్ ఆసక్తి, అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఉగాది సందర్భంగా రాష్ట్రంలో 25 లక్షల మంది ఇళ్లులేని పేదలకు స్ధలాలు ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం... ఈ కార్యక్రమాన్ని విశాఖలో ప్రారంభించబోతోంది. ముఖ్యమంత్రి గృహప్రవేశం రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. అన్నీ అనుకూలిస్తే విశాఖలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా నిర్వహిస్తారు.

(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)Video : శ్రీనగర్‌లో మంచు వర్షం... చూసి తీరాల్సిందే
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు