ఏపీలో చంద్రబాబు అనుచరులపై ఐటీ పంజా.. అసలేం జరుగుతోంది ?

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులపై ఐటీ అధికారులు రెండు రోజులుగా చేస్తున్న దాడులు కలకలం రేపుతున్నాయి.

news18-telugu
Updated: February 7, 2020, 12:21 PM IST
ఏపీలో చంద్రబాబు అనుచరులపై ఐటీ పంజా.. అసలేం జరుగుతోంది ?
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ కరెస్పాండెంట్)

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులపై ఐటీ అధికారులు రెండు రోజులుగా చేస్తున్న దాడులు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావుతో పాటు కడప జిల్లా పార్టీ అద్యక్షుడు శ్రీనివాసరెడ్డి నివాసాలపై జరుగుతున్న దాడులపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి ఆర్ధికంగా మూల స్తంభాలుగా ఉన్న వారిపై కేంద్ర సంస్ధల దాడులను తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు ఇప్పుడు మౌనం వహించడం వెనుక కారణాలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ టీడీపీలో గత ఐదేళ్లుగా కీలకంగా వ్యవహరించిన పలువురు నేతల ఇళ్లపై ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. అదీ గత ప్రభుత్వంలో చంద్రబాబుకు పీఎస్ గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుతో పాటు కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లపై జరుగుతున్న దాడులు టీడీపీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాసరావు లావాదేవీలపై ఐటీ సోదాలు చేపట్టడం ఇప్పుడు టీడీపీతో పాటు రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. గత ఐదేళ్లలో చంద్రబాబు సమక్షంలో జరిగిన ప్రతీ విషయానికి శ్రీనివాసరావును ప్రత్యక్ష సాక్షిగా ఐటీ అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు వద్ద తన పలుకుబడిని వినియోగించి శ్రీనివాస్ ఎలాంటి లావాదేవీలు చేశారన్న దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. విజయవాడలోని శ్రీనివాసవరావుకు చెందిన ఫ్లాట్ లో ఐటీ అధికారులు గంటల తరబడి సోదాలు నిర్వహించడమే కాకుండా పలు కీలక ఆధారాలను సైతం సేకరించారు. వాటి అధారంగా శ్రీనివాసరావుతో పాటు ఆయనతో లావాదేవీలు జరిపిన పలువురిని ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డికి చెందిన నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. కొన్నేళ్లుగా కడప జిల్లాలో చంద్రబాబుకు నమ్మినబంటుగా ఉన్న శ్రీనివాసరెడ్డి భారీగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఆరా తీసేందుకు ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెరవెనుక ఏం జరిగిందో పూర్తిగా బయటికి రాకపోయినా చంద్రబాబు కన్నుసన్నల్లో శ్రీనివాసరెడ్డి జరిపిన లావాదేవీలపై ఐటీ దృష్టిసారించినట్లు అర్ధమవుతోంది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు శ్రీనివాసరెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలు కాంట్రాక్టులు కూడా పొందినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టిసారించినట్లు అర్ధమవుతోంది.

అయితే చంద్రబాబు సన్నిహితులపై ఐటీ అధికారులు చేస్తున్న దాడులపై నోరు మెదిపేందుకు పార్టీలో నేతలెవరూ ఇష్టపడటం లేదు. తమ పార్టీకి చెందిన కీలక నేతలపై కేంద్ర సంస్ధల దాడులపై గతంలో చంద్రబాబు తీవ్రంగా విరుచుకుపడేవారు. ఓ దశలో రాష్ట్రంలో సీబీఐ ప్రవేశాన్ని కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది. అధికారం మారిన తర్వాత సీబీఐపై కానీ, ఇతర కేంద్ర సంస్ధలపై కానీ మాట్లాడేందుకు చంద్రబాబుతో పాటు టీడీడీపీ నేతలెవరూ సాహసించడం లేదు. కేంద్ర సంస్ధల దాడులపై తాము స్పందిస్తే బీజేపీ నేతలకు ప్రతికూల సంకేతాలు వెళతాయని చంద్రబాబు భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 7, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading