తెలుగు రాష్ట్రాల్లో ‘ఇదే ఆల్ టైమ్ రికార్డ్’ అంటున్న వైఎస్ జగన్

YS Jagan mohan Reddy | ఆగస్టు 15 నాటికి గ్రామ వాలంటీర్ల ఉద్యోగ నియామకాలను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: July 21, 2019, 4:23 PM IST
తెలుగు  రాష్ట్రాల్లో ‘ఇదే ఆల్ టైమ్ రికార్డ్’ అంటున్న వైఎస్ జగన్
వైఎస్ జగన్ (File)
  • Share this:
ఏపీలో వైసీపీ ప్రభుత్వం భర్తీ చేయబోతున్న గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు భారీ స్పందన వస్తోంది. ఒకేసారి లక్ష ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల్లో సైతం సానుకూలత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇంత భారీ స్ధాయిలో ఉద్యోగాల భర్తీ కూడా తొలిసారి కావడంతో ప్రభుత్వం కూడా ఇందుకు ఎంతో కసరత్తు చేస్తోంది. లక్షా 33వేల 494 శాశ్వత ఉద్యోగాల కల్పన తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఓ రికార్డు అంటూ స్వయంగా సీఎం వైఎస్ జగన్ గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలపై ట్వీట్ కూడా చేశారు. ఏపీలో ఆగస్టు 15 నాటికి లక్షకు పైగా గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకూ అధికార యంత్రాంగం దీని కోసం భారీగా శ్రమిస్తోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇచ్చిన గడువులోగా గ్రామ వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం జగన్ ఆదేశాన్ని అమలు పరిచేందుకు పలుశాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయనుండటంపై ప్రజల్లోనూ సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గగనమైపోతున్న వేళ.. వంద ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే పదివేల మంది పోటీపడుతున్న నేపథ్యంలో గ్రామ వాలంటీర్ల రూపంలో లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయనుండటం, అదీ శాశ్వత ప్రాతిపదికన కానుండటం రికార్డు కానుంది.

గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందాలన్న సీఎం జగన్ ఆకాంక్ష మేరకు గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ పనిచేయనుంది. మొత్తం 4 లక్షల వాలంటీర్లను నియమిస్తామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తోంది. తొలి విడతగా లక్షా 33 వేల 494 వాలంటీర్ల పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత దశల్లో మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నారు. ఒకేసారి ఇంత భారీ స్ధాయిలో ఉద్యోగాల భర్తీ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగం రేటు కూడా తగ్గుముఖం పట్టే అవకాశముంది. ప్రజల ఆశీర్వాదం వల్లే ఇంతపెద్ద కార్యక్రమం చేపడుతున్నట్లు స్వయంగా సీఎం జగన్ ఇవాళ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

‘తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,434 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాద బలం వల్లే ఇది సాధ్యమవుతోంది. ’
- 'ట్విట్టర్ లో సీఎం వైఎస్ జగన్


నెలనెలా రేషన్ సరఫరాతో పాటు ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు నవరత్నాల పరిధిలోకి వచ్చే సేవలన్నింటినీ గ్రామ సచివాలయాల ద్వారా పూర్తిస్ధాయిలో అమలు చేయించాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలోనూ 50 ఇళ్లకో వాలంటీర్ చొప్పున నియమిస్తున్నారు. ప్రతీ 2 వేలమంది జనాభాకు ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు కానుంది. వీటి ద్వారా ప్రభుత్వ సేవలన్నీ పారదర్శకంగా ప్రజలకు అందాలని సీఎం జగన్ లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం ప్రభుత్వం ఈసారి బడ్డెట్ లోనూ ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలోనూ గ్రామ సచివాలయాల వ్యవస్ధకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆగస్టు 15 నాటికి ఈ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: July 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>