ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్ష తెలుగుదేశం (Telugu Desham Party), భారతీయ జనతాపార్టీల (Bharatiya Janatha Party) మధ్య పొత్తుపై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. 2024 ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలో దిగేందుకు టీడీపీ యత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడు ఈ టాపీక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనా ఆ తర్వాత పెద్దగా తెరమీదకు రావడం లేదు. ఐతే ఈ రెండు పార్టీలు పొత్తులపై నేరుగా మాట్లాడకపోయినా.. ఏపీలోని అధికార వైసీపీ (YSRCP) మాత్రం వీరి మధ్య పరోక్ష వారధిలా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ టీడీపీ, బీజేపీలకు పనితగ్గించాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ అంశంపైనే చర్చజరుగుతోంది.
ఇటీవల సంభవించిన వరదలకు కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్ సభలో మాట్లాడారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని ఆయన అన్నారు. ప్రాజెక్టు గేట్లను సకాలంలో ఎత్తకపోవడం వల్ల నష్టం వాటిల్లిందన్నారు. అంతేకాదు గేట్లకు కనీసం గ్రీజు కూడా పూయలేదని.. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు.
ఐతే కేంద్ర మంత్రి వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. కేంద్రం వ్యాఖ్యలను ఖండించే క్రమంలో ఇది పక్కగా చంద్రబాబు ప్లాన్ అని.. కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ చంద్రబాబు స్టేట్ మెంట్ మాదిరిగా ఉందని చెప్పడంతో అసలు బీజేపీ-టీడీపీని వైసీపీనే కలుపుతోందా అనే చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు స్టేట్ మెంట్ ను ఆయన దూతలు కేంద్ర మంత్రితో చెప్పించి ఉంటారని సజ్జల అభిప్రాయపడ్డారు.
బద్వేలు ఉపఎన్నిక సందర్భంగా టీడీపీ-బీజేపీ పొత్తుపై వైసీపీ ఆరోపణలు చేసింది. బీజేపీ అభ్యర్థి కోసమే టీడీపీ పోటీ నుంచి తప్పుకుందని ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్న ప్రచారం కూడా చేసింది. అప్పట్లో రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కూడా టీడీపీతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై స్థానిక నేతల పెత్తనం లేదని.. కేంద్ర నాయకత్వమే అన్నీ చూసుకుంటుందన్నారు. అంతేకాదు పొత్తుపెట్టుకుంటే తప్పేంటన్నట్లు మాట్లాడారు కూడా. దీంతో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీలు రెండు పార్టీల మధ్య పొత్తుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరిగింది. ఇప్పుడు వైసీపీ నేతలు ఏకంగా లోక్ సభలో కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను చంద్రబాబు స్టేట్ మెంట్ గా అభివర్ణించడంతో వైసీపీనే పొత్తును కోరుకుంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp-tdp, Ysrcp