ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడిపిస్తున్నారని.. టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వారి ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో తెలియదుగానీ, ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్న తీరు చూస్తుంటే.. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని కాదుగానీ.. అచ్చం తెలంగాణ ఎన్నిలకు ముందు కేసీఆర్ వ్యవహరించినట్టుగానే... ఇప్పుడు ఏపీ ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారన్నది మాత్రం నిజమనిపిస్తోంది. కేసీఆర్‌కు, జగన్మోహన్‌రెడ్డికి ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక విషయాల్లో సారూప్యతను గమనించవచ్చు. పోయినేడాది సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. మరుసటి రోజే 105 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రత్యర్థులకు పెద్ద సవాల్ విసిరారు. అంతేకాదు, సొంత పార్టీలో అసమ్మతి సెగలు పుట్టినా ఆయన వెనుకడుగు వేయలేదు. ఒక్కరంటే ఒక్క అభ్యర్థిని కూడా మార్చకుండా.. మిగితా 14 మంది అభ్యర్థులను కూడా ప్రకటించేసి ముందుకు సాగారు.
ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కూడా.. ఒకేసారి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. అసమ్మతి చెలరేగే ప్రమాదం ఉన్నా ఆయన లెక్క చేయలేదు. కేసీఆర్ మాదిరే డేరింగ్‌గా ముందడుగు వేశారు. అందులోనూ 25 మంది సిట్టింగులను కాదని కొత్తవారికి అవకాశం ఇచ్చి.. పెద్ద సాహసమే చేశారు.
ఇక, కేసీఆర్ ఎన్నికల ముందు విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్రస్వామి చెప్పినట్టుగానే నడుచుకున్నారు. ముహూర్తబలం చూసుకునే అభ్యర్థులను ప్రకటించారు. స్వామిజీ చెప్పిన విధంగానే రాజశ్యామల యాగం చేసి.. ప్రచారానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఇప్పుడు జగన్ కూడా స్వరూపానందేంద్ర స్వామి చెప్పిన ముహూర్తానికే అభ్యర్థుల ప్రకటన చేశారు. 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఈరోజు ఇడుపుల పాయలో ప్రకటించినా.. ఈ తంతుకు శ్రీకారం శనివారం సాయంత్రమే చుట్టారు. స్వామిజీ మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో 9 మందితో కూడిన పార్లమెంటు అభ్యర్థుల జాబితాను వైసీపీ లాంఛనంగా ప్రకటించింది. ఈ విషయాన్ని పార్టీనేతలే స్వయంగా చెప్పడం విశేషం.
ఈ నేపథ్యంలో ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్లాన్... ఏపీలో జగన్ ఫాలో అయితే.. ఫలితం కూడా తెలంగాణ మాదిరే ఉంటుందా? లేక మరోలా ఉంటుందా? అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, CM KCR, Telangana Election 2018, Visakhapatnam, Ys jagan