రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అవసరాలు, పరిస్థితులు బట్టి రాజకీయాల్లో మిత్రుత్వం, శత్రుత్వం ఏర్పడుతుంటాయి. ఏపీ, తెలంగాణ అధికార పార్టీలు వైసీపీ, టీఆర్ఎస్ మధ్య గతంలో మిత్రుత్వం ఉండేది. అయితే ఆ తరువాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య తలెత్తిన జలవివాదాలతో ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ, టీఆర్ఎస్ మధ్య గ్యాప్ కూడా పెరిగినట్టు కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేస్తున్న వ్యాఖ్యలు, ఏపీ మంత్రి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా ఏపీ విషయంలో సీఎం కేసీఆర్ చిన్నచూపుతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీలోని అధికార వైసీపీ భావిస్తోంది. ఏపీ చీకటైపోయిందని.. తాము ఏపీలో పార్టీ పెట్టాలని అక్కడ వాళ్లు కోరుకుంటున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీలో గట్టిగానే జరిగినట్టు వార్తలు వచ్చాయి.
ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని (Perni Nani) స్పందించారు. కేసీఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకన్న పేర్ని.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ పెట్టడానికి ముందుగా.. తెలంగాణ కేబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే బాగుంటుందన్నారు పేర్ని నాని. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చని చెప్పారు. ఏపీ, తెలంగాణాలు సమైక్యంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారని చెప్పారు.
అంతేకాదు నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారని, దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్ళించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తమకు కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడు నీళ్లు కూడా వాడుకోబోమని ఎప్పుడో చెప్పామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎంత దూరమో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కూడా అంతే దూరం ఉంటుందని కేసీఆర్ గుర్తించాలన్నారు.
KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?
Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?
అయితే సీఎం జగన్ నుంచి స్పష్టమైన సంకేతాలు ఉంటేనే ఆయన కేసీఆర్‌పై ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఏపీపై చేస్తున్న వ్యాఖ్యల విషయంలో మెతక వైఖరి వద్దని సీఎం జగన్ (YS Jagan) మంత్రులకు సూచించారేమో అనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికప్పుడు కేసీఆర్‌పై విమర్శలు చేసేంత స్థాయికి ఏపీ అధికార పార్టీ నేతలు వెళ్లకపోయినా.. ఏపీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు మాత్రం ధీటుగా కౌంటర్ ఇవ్వాలని డిసైడయినట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap minister perni nani, CM KCR, Telangana