వైసీపీ ఎమ్మెల్యే విజయానికి వంగవీటి రాధా సహకరించారా ?

వంగవీటి రాధ పార్టీ మారడం కారణంగా కొడాలి నానితో ఉన్న స్నేహానికి ఎలాంటి ఇబ్బంది రాలేదని సమాచారం. దీంతో ఆయన కొడాలి నాని గెలుపు కోసం పరోక్షంగా సహకరించి ఉంటారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: April 20, 2019, 8:09 PM IST
వైసీపీ ఎమ్మెల్యే విజయానికి వంగవీటి రాధా సహకరించారా ?
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
  • Share this:
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఎన్నికల యుద్ధం ఏ స్థాయిలో నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయం కోసం ఇరు పార్టీలు తమ శక్తివంచన మేరకు తీవ్రంగా శ్రమించాయి. మరీ ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లు మరోసారి గెలిచేందుకు మరింతగా కష్టపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే మంచి పదవి గ్యారంటీ అని ప్రచారంలో ఉన్న ఆ పార్టీ ముఖ్యనేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం గెలుపు కోసం తనదైన శైలిలో వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగారు. టీడీపీకి కృష్ణా జిల్లాలో కొరకరాని కొయ్యగా ఉన్న కొడాలి నానిని ఓడించేందుకు మాజీమంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపింది టీడీపీ. కొడాలి నానికి అవినాష్ బలమైన ప్రత్యర్థి అనే ప్రచారం కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది.

ఈ క్రమంలోనే మరోసారి గుడివాడలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డిన కొడాలి... ఈ క్రమంలో టీడీపీ నేత సహకారం తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన కొడాలి నాని కమ్మ సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయలేదు. దీనికి తోడు దేవినేని అవినాష్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో... ఈ సామాజికవర్గం ఓట్లు ఇరువురు నేతలకు సమానంగా పడే అవకాశం ఉందనే ప్రచారం ఎన్నికలకు ముందే సాగింది. ఈ విషయాన్ని గమనించిన కొడాలి నాని... గుడివాడలో బలమైన కాపు సామాజికవర్గం ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు వంగవీటి రాధాకృష్ణ సాయం తీసుకున్నారనే ప్రచారం జరిగింది.

కొడాలి నానికి వంగవీటి రాధాకృష్ణకు మొదటి నుంచి మంచి స్నేహం ఉంది. ‘వంగవీటి’ సినిమా విడుదల సందర్భంగా ఏర్పడిన వివాదం కొడాలి నాని జోక్యంతో సద్దుమణిగింది. వంగవీటి రాధ వైసీపీని వీడకుండా అడ్డుకునేందుకు కొడాలి నాని చివరివరకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే వంగవీటి రాధ పార్టీ మారడం కారణంగా ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది రాలేదు. దీంతో ఆయన కొడాలి నాని గెలుపు కోసం పరోక్షంగా సహకరించి ఉంటారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

మరోవైపు దేవినేని కుటుంబంతో వైరం కూడా వంగవీటి రాధ గుడివాడలో కొడాలి నాని వైపు మొగ్గు చూపేందుకు కారణం కావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కొడాలి నాని అనుచరుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. కొడాలి నానికి వంగవీటి రాధాతో స్నేహం ఉన్న మాట వాస్తవమే అయినా... ఆయన మాత్రం దాన్ని రాజకీయంగా వాడుకోలేదన్నది వారి వాదన. గుడివాడలో కాపులు మొదటి నుంచి కొడాలి నాని వైపే ఉన్నారని... దేవినేని అవినాష్ రంగంలోకి దిగడం కూడా తమకు మరింత కలిసొచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>