హోమ్ /వార్తలు /రాజకీయం /

టీడీపీ ఎమ్మెల్యే వంశీ బెంగళూరులో జగన్‌ను కలిశారా ? వైసీపీ నేత సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే వంశీ బెంగళూరులో జగన్‌ను కలిశారా ? వైసీపీ నేత సంచలన ఆరోపణలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ

గన్నవరంలో వంశీకి వైసీపీ అభ్యర్థికి మధ్య ఇంత గొడవ జరుగుతున్నా... టీడీపీ నాయకత్వం ఆయనకు అంతగా మద్దతు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

    కృష్ణా జిల్లా గన్నవరంలో అధికార, విపక్ష పార్టీ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. వంశీ తన ఇంటికి వచ్చి బెదిరించేందుకు ప్రయత్నించారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించగా... వెంకట్రావు ఎవరో తెలియకుండానే తాను ఆయనకు సాయం చేశానని వంశీ చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉంటే తాజాగా గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావు చేసిన సరికొత్త ఆరోపణలపై టీడీపీతో పాటు కృష్ణా జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యే వంశీ దంపతులు బెంగళూరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కలిశారని గన్నవరం వైసీపీ అభ్యర్థి వెంకట్రావు ఆరోపించడం సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది. గన్నవరంలో వంశీకి వైసీపీ అభ్యర్థికి మధ్య ఇంత గొడవ జరుగుతున్నా... టీడీపీ శ్రేణులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.


    అయితే వల్లభనేని వంశీకి వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే... వైసీపీ అధికారంలోకి వస్తే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. వంశీకి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి రాజకీయాలకు అతీతంగా సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఒకసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వంశీ బహిరంగంగా ఆలింగనం చేసుకోవడంపై టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. తాజాగా వైసీపీ అభ్యర్థితో గొడవ పడుతున్న వంశీ... ఎక్కడా వైసీపీని కానీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించకపోవడం గమనార్హం. దీంతో గన్నవరం ఎమ్మెల్యే వంశీ గెలిచినా ఓడినా... వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళతారనే ప్రచారం టీడీపీలోనూ జరుగుతోంది. మొత్తానికి గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ వివాదం విషయంలో టీడీపీ నాయకత్వం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.    First published:

    Tags: Gannavaram, Tdp, Vallabhaneni vamsi, Ys jagan mohan reddy, Ysrcp

    ఉత్తమ కథలు