Telangana: ఇటీవల మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు టీఆర్ఎస్ నాయకత్వం మళ్లీ ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. అలాంటి ఎమ్మెల్యేల జాబితాలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒకరు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాను తట్టుకుని కాంగ్రెస్ తరపున నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిచారు చిరుమర్తి లింగయ్య. స్వతహాగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చిరుమర్తి లింగయ్య అనుచరుడు. 2009లో చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ టికెట్ రావడంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌దే కీలక పాత్ర. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన చిరుమర్తి లింగయ్య.. 2014లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం చేతిలో ఓడిపోయారు. అయితే 2018 ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయినా..చిరుమర్తి లింగయ్య మాత్రం విజయం సాధించారు. అయితే ఆ తరువాత ఆయన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ తిరిగి కాంగ్రెస్‌లోకి వెళతారా ? లేక వేరే ఇతర పార్టీలోకి వెళతారా ? అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో ఉన్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా యాక్టివ్‌గా ఉన్నారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గానికి అసలు పొసగడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ తమ నేతకే అని వేముల వీరేశం వర్గీయులు చెబుతుంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తమ నాయకుడు చిరుమర్తి లింగయ్యకే టీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు టీఆర్ఎస్ నాయకత్వం మళ్లీ ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని ఆయన పార్టీ ముఖ్యనేతల దృష్టికి కూడా తీసుకెళ్లారనే చర్చ సాగుతోంది. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది మొదట్లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే.. టీఆర్ఎస్ తరపున టికెట్ మళ్లీ కచ్చితంగా తనకే దక్కుతుందనే అంశంపై పార్టీ నాయకత్వం నుంచి స్పష్టత తీసుకోవాలనే యోచనలో లింగయ్య ఉన్నట్టు సమాచారం. ఒకవేళ టీఆర్ఎస్ తరపున మళ్లీ వేముల వీరేశంకు టికెట్ లభిస్తే.. తన దారి తాను చూసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నట్టు రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
ఒకవేళ ఆయన మళ్లీ పార్టీ మారాల్సి వస్తే.. తన రాజకీయ గురువులైన కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్న కాంగ్రెస్‌లో వెళతారా లేక తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీ కండువా కప్పుకుంటారా ? అన్న అంశంపై కూడా చర్చ మొదలైంది. అయితే గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీల నేతలందరికీ సీఎం కేసీఆర్ మళ్లీ టికెట్లు కేటాయించారని.. అదే జరిగితే మళ్లీ తనకు టికెట్ దక్కడం ఖాయమనే ధీమాలో ఎమ్మెల్యే చిరుమర్తి ఉన్నట్టు కొందరు చర్చించుకుంటున్నారు. అయితే పరిస్థితిని బట్టి ముందుజాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన కూడా ఆయన మనసులో ఉందనే టాక్ వినిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.