IS TRS LEADERS LOST TWO MLC SEATS BECAUSE OF ETALA RAJENDAR CM KCR STILL COMPENSATING LOSS AK
Etela Rajendar కారణంగా టీఆర్ఎస్ నేతలు రెండు పదవులు కోల్పోయారా ?
ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
Telangana: ఈటల రాజేందర్ కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నేతలను ఎంపిక చేయడంతో పాటు ఊహించని మరో నేతకు మంత్రి పదవి ఇవ్వాలని ప్లాన్ చేయడం నిజంగా అనూహ్య నిర్ణయమే అవుతుందనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.
టీఆర్ఎస్ తరపున ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా లభించింది. ఈసారి ఈ కోటా నుంచి ఏకంగా ఆరుగురికి అవకాశం ఉండటంతో.. ఆ అదృష్టం తమను వరిస్తుందేమో అని టీఆర్ఎస్లోని ఆశావాహులు భావించారు. అయితే మాజీమంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఎఫెక్ట్.. ఈ ఆరు స్థానాల్లో రెండు స్థానాలపై పడుతుందని ఎవరూ ఊహించలేరు. కానీ జరిగింది మాత్రం అదే. ఈ ఆరు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్.. వారిలో కౌశిక్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌కు అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కౌశిక్ రెడ్డి పేరు గవర్నర్ పెండింగ్‌లో పెట్టడంతో.. ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ చాలాకాలం క్రితమే నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అనూహ్యంగా ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ను ఎంపిక చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ పదవీకాలం మరికొన్ని సంవత్సరాలు ఉండగానే.. ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్ పార్టీని వీడటం కారణంగా ముదిరాజ్‌లకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే.. అదే సామాజికవర్గానికి చెందిన బండా ప్రకాశ్‌ను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఈటల రాజేందర్‌కు చెక్ చెప్పాలనే ఉద్దేశ్యంతో అటు పాడి కౌశిక్ రెడ్డికి, ఇటు బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకోవడం ద్వారా తమకు రావాల్సిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కకుండా పోయాయని టీఆర్ఎస్లోని కొందరు నేతలు చర్చించుకుంటున్నట్టు సమాచారం.
టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఈటల రాజేందర్ మళ్లీ గెలవడం ద్వారా ఆయన ఎమ్మెల్యే సీటు మళ్లీ ఆయనకు దక్కింది. ఇక ఆయన వెళ్లిపోవడం ద్వారా ఖాళీ అయిన మంత్రివర్గంలోని స్థానాన్ని బండా ప్రకాశ్ ద్వారా భర్తీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే... అసలు తనకు మంత్రి పదవి యోగం వస్తుందని ఊహించని ఆయనకు ఇది అనుకోని సదావకాశమే అని చెప్పకతప్పదు.
అదే సమయంలో ఒకవేళ ఆయనను కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటే.. ఎప్పటి నుంచో కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ నేతలకు నిరాశ తప్పకపోవచ్చనే చర్చ కూడా సాగుతోంది. ఈటల రాజేందర్ కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నేతలను ఎంపిక చేయడంతో పాటు ఊహించని మరో నేతకు మంత్రి పదవి ఇవ్వాలని ప్లాన్ చేయడం నిజంగా అనూహ్య నిర్ణయమే అవుతుందనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.