• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • IS THIS THE STORY BEHIND REUTERS INDIA STORY ON KIA MOTORS MOVING OUT OF ANDHRA PRADESH BA

కియాపై రాయిటర్స్ కథనాల వెనుక అసలు కథ ఇదేనా?

కియాపై రాయిటర్స్ కథనాల వెనుక అసలు కథ ఇదేనా?

కియా మోటార్స్ లోగో

ఏపీ ప్రభుత్వంతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేరుగా ఆ మాటను చెప్పకుండా రాయిటర్స్ కథనాలతో పరోక్షంగా కియా యాజమాన్యం దీన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ నుంచి కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందంటూ అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్ కథనం రేపిన సంచలనం ఇంకా చల్లారడం లేదు. గతంలో తాము పెట్టిన ట్వీట్ ను తొలగించి సవరణ పెడుతున్నామంటూ తిరిగి కియా ఆంద్రప్రదేశ్ దాటి వెళ్లిపోతోందంటూ నిర్ధారించడం ద్వారా రాయిటర్స్ మరోసారి కలకలం రేపింది.  దీంతో ప్రభుత్వ వర్గాలే కాదు మీడియా సంస్ధల్లోనూ గందరగోళం నెలకొంది. అయితే ఈ కథనాల వెనుక ఉన్నది రాయిటర్స్ కాదు నేరుగా కియానే అనే ప్రచారం సాగుతోంది.

    CM YS Jagan invited to launch of Kia new car on 8 Aug, మార్కెట్లోకి కియా కారు.... సీఎం జగన్‌కు ఆహ్వానం
    సీఎం జగన్‌తో కియా కంపెనీ ప్రతినిధులు


    గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోని అనంతపురం జిల్లాలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ ప్లాంటును నెలకొల్పిన కియా మోటార్స్ భారీ ఎత్తున రాయితీలు కూడా పొందింది. తమిళనాడులో కార్ల తయారీకి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు ఉన్నా సరే ఏపీలో తమ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చింది. చంద్రబాబు హయాంలో ఇవ్వచూపిన రాయితీలతో పాటు పలు ప్రోత్సహకాలే ఇందుకు కారణం. చంద్రబాబు ప్రభుత్వం కియాకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటించిందే కానీ వాటిని ఇవ్వకుండానే కాలం గడిపేసింది. చివరికి టీడీపీ స్ధానంలో వచ్చిన వైసీపీ సర్కారు సదరు ప్రోత్సాహకాలను ఇంకా ఇవ్వనేలేదు. అంతలోనే స్ధానికంగా యువతకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనను తీసుకొచ్చింది. పాత ప్రోత్సహకాలు రాకపోవడం, కొత్తగా నెలకొల్పే అనుబంధ ప్లాంట్లకూ ప్రోత్సహకాలు ఇస్తారో లేదో తెలియదు, మొత్తంగా 75 శాతం స్ధానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి రావడం వంటి కారణాలతో కియాకు కష్టాలు మొదలయ్యాయి.

    కియా కంపెనీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్


    వాస్తవానికి అధికారం టీడీపీ నుంచి వైసీపీకి చేతులు మారిన తర్వాత ప్లేటు మార్చి సీఎం జగన్ తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ తమకు మంచి సంబంధాలు ఉన్నాయని కియా యాజమాన్యం ప్రకటించుకుంది.  ఆ తర్వాత సీఎం జగన్ చేతుల మీదుగా కొత్త కార్ల యూనిట్ ను కూడా ప్రారంభోత్సవం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో చేసిన మార్పులతో కియాకు  కూడా ఇబ్బందులు తప్పలేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సహకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ విశ్వసనీయత మీదే పెట్టుబడులు వస్తాయనేది వైసీపీ సర్కారు వాదన. దీంతో కియాకు కూడా ప్రోత్సాహకాల విషయంలో ప్రభుత్వం నుంచి మొండిచేయి తప్పలేదు. అదే సమయంలో స్ధానిక ఉద్యోగాల వ్యవహారం కూడా కియాకు చికాకులు తెచ్చిపెట్టింది.

    KIA Motors : కియా మోటార్స్‌ తరలింపు అంశంపై ఆ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు...
    కియా మోటార్స్ లోగో


    మరోవైపు కొత్తగా ఎంపీ అయిన గోరంట్ల మాథవ్ స్ధానిక ప్రజాప్రతినిధిగా తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే ఆవేదనతో కియా యాజమాన్య ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించడం కూడా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దీంతో కియా యాజమాన్యం తమిళనాడుకు తమ కొత్త ప్లాంటు తరలింపుపై సంప్రదింపులు జరిపినట్లు రాయిటర్స్ కథనం రాసింది.  రాయిటర్స్ కథనంపై తీవ్ర దుమారం చెలరేగడంతో కియా యాజమాన్యంతో పాటు ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా స్పందించాయి. కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లిపోవడం లేదని, తమిళనాడుతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని కూడా వివరణ ఇచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా కియా తమతో ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపింది.

    రాయిటర్స్ చేసిన మొదటి ట్వీట్. దాని సవరణ


    ఈ వివరణలతో వివాదం సద్దుమణుగుతుందన్న తరుణంలో రాయిటర్స్ తమ పాత ట్వీట్ స్ధానంలో సవరించిన మరో ట్వీట్ పెట్టింది. అయితే ఇందులోనూ కియా మోటార్స్ ఏపీ నుంచి మరో రాష్ట్రానికి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది, దీంతో రాయిటర్స్ మరోసారి తన వాదనకు కట్టుబడినట్లయింది. ఏపీ ప్రభుత్వంతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేరుగా ఆ మాటను చెప్పకుండా రాయిటర్స్ కథనాలతో పరోక్షంగా కియా యాజమాన్యం దీన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏపీ సర్కారు మరోసారి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

    (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు