YS Sharmila: వైఎస్‌ షర్మిలకు ఖమ్మం సెంటిమెంటుకు అదే కారణమా..? ఆమె తొలి యాత్రపై జోరుగా ఊహాగానాలు..

వైఎస్ షర్మిల (File)

వైఎస్ షర్మిల తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీ విషయంలో ఖమ్మం జిల్లాకుఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. పార్టీ పెట్టబోతున్నట్టు వారం క్రితం వెల్లడించిన వైఎస్‌ షర్మిల తొలిగా ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతోనే ముచ్చటించారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  ఖమ్మం జిల్లా అంటే వైఎస్‌ షర్మిలకు ఎందుకంత అభిమానం..? ఆమెకు ఇక్కడేమైనా సెంటిమెంట్‌ ఉందా..? ఇక్కడినుంచి ప్రారంభిస్తే విజయం తథ్యమన్న నమ్మకం ఉందా..? అంటే అవుననే చెప్పాలి. వైఎస్ షర్మిల తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీ విషయంలో ఖమ్మం జిల్లాకుఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. పార్టీ పెట్టబోతున్నట్టు వారం క్రితం వెల్లడించిన వైఎస్‌ షర్మిల తొలిగా ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతోనే ముచ్చటించారు. దీనికి ప్రత్యేక కారణం ఏదీ లేకపోయినా ఆమెకు ఈ జిల్లాలో లభించిన ఆదరణ, అభిమానాలేనని చెబుతున్నారు.

  సోమవారం నాడు వైఎస్‌ షర్మిలను కలిసేందుకు ఖమ్మం నుంచి భారీ సంఖ్యలో కార్లు ర్యాలీగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు చేరడం.. ఆమె వారితో భేటీ కావడం.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించడం.. త్వరలోనే ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని వారికి చెప్పడంతో అభిమానుల్లో సహజంగానే ఉత్సాహం నిండింది. అయితే ఇప్పటికే ప్రకటించినట్టు ఈనెల 21న కాకుండా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం వైఎస్‌షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని అభిమానులు చెబుతున్నారు. ఇక్కడి ఆదివాసులు, గిరిజనుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి భారీ సంఖ్యలో అభిమానులు ఉండడమే షర్మిల నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు.

  చెరగని ముద్ర వేసిన వైఎస్...

  telangana, IT in khammam, khamma, khammam IT hub, infirmation technology, telangana news, ktr, k tarakaramao, puvvada ajay kumar ఖమ్మం, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాంకేతిక ఫలాలు, ఐటీ హబ్, కేటీఆర్, పువ్వాడ అజజ్ కుమార్
  ప్రతీకాత్మక చిత్రం


  ఒకప్పుడు కమ్యూనిస్టులకు ఖిల్లాగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రత్యేక దృష్టి సారించారు. గిరిజనులకు పోడు పట్టాలను అందించారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఫారెస్ట్‌ వివాద భూములను సెటిల్‌ చేశారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు దశాబ్దాలుగా ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి నివాస సదుపాయం కల్పించారు. పూర్తిగా సింగరేణి సంస్థ ప్రైవేటు ఆస్తి అయిన కొత్తగూడెం పట్టణంలో కొన్ని వేల మందికి పట్టాలు జారీ చేశారు. దీంతో పాటుగా పలు సాగునీటి పథకాలు ప్రవేశపెట్టి గిరిజన రైతులకు మేలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కొద్ది మార్పులతో చేపట్టిన సీతారామ సాగునీటి ప్రాజెక్టు గతంలో వైఎస్‌ హయాంలో దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్‌ గా మొదలైన సంగతి తెలిసిందే. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముద్ర ఎప్పటికీ చెరగనిదే. బహుశా అందుకే రాష్ట్ర విభజన అనంతరం సైతం ఖమ్మం ఎంపీతో బాటు, పినపాక, అశ్వారావుపేట, వైరా నియోజవర్గాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

  అదీ కలిసొచ్చే అంశమే...

  రాజకీయ పరంగా ఉన్న ఈ నేపథ్యానికి తోడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి ఇక్కడకు వలస వచ్చి స్థిరపడిన వారి సంఖ్య గణనీయంగా ఉండడమూ ఓ కారణంగా చెబుతున్నారు. గోదావరికి రెండు వైపులా ఉన్న వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, పినపాక, మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం మండలాలతో బాటు, ఇంకా ఖమ్మం, ఇల్లెందు, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి పట్టణాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌నుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య ఎక్కువే. దీంతోబాటు జిల్లాలో మెజారిటీ భాగం అటు కృష్ణా జిల్లా, ఇటు పశ్చిమగోదావరి, తూర్పుగోదవరి జిల్లాలతో.. సంబంధ బాంధవ్యాలతో పెనవేసుకుని ఉండడం కూడా ప్రత్యేక కారణంగా పేర్కొంటున్నారు.

  తగు జాగ్రత్తలు.. పక్కా ప్లాన్ తో...

  ఒకవేళ రాజకీయ అరంగేట్రం చేస్తున్న వైఎస్ షర్మిలపై ముందస్తుగానే తెలంగాణేతర ముద్ర పడకుండా ఉండేందుకు.. రాష్ట్రంలో కొంత భాగంలో ఆమె పట్ల సానుకూలత ఉన్నట్టు పాజిటివ్‌ స్పందన లభిస్తే మిగిలిన ప్రాంతంలో పరిస్థితి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికితోడు హైదరాబాద్‌లో ఎటూ సెటిలర్స్‌కు తోడు తన సొంత సామాజికవర్గం, మైనారిటీల పైనా వైఎస్‌ షర్మిల పెద్ద అంచనాలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వైఎస్‌ అభిమానుల్లో మాత్రం షర్మిల పార్టీ నిర్ణయం కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పొచ్చు.
  Published by:Srinivas Munigala
  First published: