Revanth Reddy: రేవంత్ రెడ్డి 72 సీట్ల లెక్కేంటి ?.. కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారా ?

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Revanth Reddy: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు వంద సీట్లు కచ్చితంగా వస్తాయని సీఎం కేసీఆర్ పదే పదే చెప్పారు. అయితే టీఆర్ఎస్ మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ... కేసీఆర్ చెప్పిన వంద సీట్ల లెక్క మాత్రం తప్పింది.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత దూకుడు పెరిగింది. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్. దళిత గిరిజన దండోరా సభలు ఏర్పాటు చేసి ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రాష్ట్రంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించే కాంగ్రెస్ శ్రేణులను ఒక్కతాటిపై తీసుకొచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా ఉండే కాంగ్రెస్ వంటి పార్టీలో అందరినీ ఒకతాటిపైకి తీసుకురావడం అంత ఈజీకాదు. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికో లేక నిజంగానే సొంతంగా సర్వే చేయించారో తెలియదు కానీ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 72 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని నేతలకు ధైర్యం చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి 72 సీట్ల లెక్క ఏంటనే అంశంపై కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    రేవంత్ రెడ్డి ఏదో మాట వరసకు 72 సీట్లు అని చెప్పారా ? లేక ఈ విషయంలో ఆయన నిజంగానే సర్వే చేయించుకుని ఈ సంఖ్యను చెప్పారా ? అని కొందరు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే కావాల్సిన సీట్ల సంఖ్య 60 సీట్లు. రేవంత్ రెడ్డి ఇందుకు మరో డజను సీట్లు ఎక్కువగా చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి 72 సీట్ల లెక్క వెనుక కేసీఆర్ తరహా వ్యూహం ఉందేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఇలాంటి గణాంకాలను చెబుతుంటారు. సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తుంటారు.

    గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు వంద సీట్లు కచ్చితంగా వస్తాయని సీఎం కేసీఆర్ పదే పదే చెప్పారు. అయితే టీఆర్ఎస్ మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ... కేసీఆర్ చెప్పిన వంద సీట్ల లెక్క మాత్రం తప్పింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో అవుతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి.. ఇందుకోసం 72 సీట్లు సాధించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారేమో అనే ప్రచారం కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: