లోకేశ్ ‘మంగళగిరి’ నివేదిక సిద్ధమైందా ? చంద్రబాబుకు ఏం చెప్పబోతున్నారు ?

నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరి తరహాలోనే అధినేతకు పోలింగ్ సరళి, విజయావకాశాలపై రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న లోకేశ్... అందులో వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

  • Share this:
    ఏపీలో ఒక్కో లోక్ సభ సెగ్మెంట్ వారీగా పోలింగ్ సరళిపై సమీక్షలు జరుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు... గెలుపుపై పార్టీ నేతల్లో ధీమాను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు లోక్ సభ సెగ్మెంట్లలో సమీక్షలు పూర్తి చేసిన చంద్రబాబు... వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇతర లోక్ సభ నియోజకవర్గాల సమీక్షల సంగతి ఎలా ఉన్నా... గుంటూరు పరిధిలోని మంగళగిరి నియోజకవర్గం సమీక్ష ఎప్పుడు ఉంటుంది ? ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

    ఎన్నికలు పూర్తయిన తరువాత నారా లోకేశ్ ఎక్కువగా బయట కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంలోనూ పార్టీ శ్రేణులకు క్లారిటీ లేదని సమాచారం. పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా బూత్ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ అధినేత చంద్రబాబు చెప్పినట్టుగా రిపోర్టులు తయారు చేసే పనిలో నిమగ్నమైపోయారు. అయితే మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ ఇందుకు సంబంధించి నివేదిక రూపొందించారా ? లేదా ? అన్నది మాత్రం తెలియడం లేదు. షెడ్యూల్ ప్రకారం గుంటూరు లోక్ సభ నియోజకవర్గంపై సమీక్ష సమావేశానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఈ సమావేశం జరుగుతుందా ? జరిగితే తన విజయావకాశాలపై లోకేశ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

    ఎవరూ ఊహించని విధంగా మంగళగిరి నుంచి బరిలోకి దిగిన నారా లోకేశ్... వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం మంగళగిరి నుంచి స్వల్ప మెజార్టీతో అయినా తాను గెలవడం ఖాయమనే ధీమాతో లోకేశ్ ఉన్నారని చర్చించుకుంటున్నాయి. మొత్తానికి పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరి తరహాలోనే అధినేతకు పోలింగ్ సరళి, విజయావకాశాలపై రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న లోకేశ్... అందులో వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
    First published: