హోమ్ /వార్తలు /రాజకీయం /

డీఎస్ మళ్లీ టీఆర్ఎస్‌కు దగ్గరవుతున్నారా ? ఎంపీ కవితతో భేటీ అందుకేనా ?

డీఎస్ మళ్లీ టీఆర్ఎస్‌కు దగ్గరవుతున్నారా ? ఎంపీ కవితతో భేటీ అందుకేనా ?

డీఎస్, కవిత

డీఎస్, కవిత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలిగిన డి.శ్రీనివాస్... ఆ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తాజాగా ఆయన కుమారుడు సంజయ్ టీఆర్ఎస్ ఎంపీ కవితతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌తో విభేదించి కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మళ్లీ గులాబీ గూటికి దగ్గరవుతున్నారా ? ఈ కారణంగానే తన కుమారుడితో టీఆర్ఎస్ ఎంపీ కవితకు రాయబారం పంపించారా ? నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలిగిన డి.శ్రీనివాస్... ఆ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే... మళ్లీ డీఎస్ కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.


    డి.శ్రీనివాస్ అనుచరులుగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది. తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపిన డీఎస్... తాను మాత్రం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరితే...తన రాజ్యసభ సభ్యత్వం పోతుందనే కారణంగా ఆయన ఎక్కడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యార్థినిపై లైంగిక దాడి కేసు ఎదుర్కొన్న ఆయన కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు.


    అలాంటి సంజయ్ బుధవారం టీఆర్ఎస్ ఎంపీ కవితతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎంపీ కవితతో డీఎస్ తనయుడు సంజయ్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై జిల్లా రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మళ్లీ తాను టీఆర్ఎస్‌లో పని చేస్తానని డీఎస్ కుమారుడి ద్వారా కవితకు సమాచారం పంపించారనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు బీజేపీ తరపున డీఎస్ రెండో తనయుడు అరవింద్ నిజామాబాద్ లోక్‌సభకు పోటీ చేయరనే హామీ ఇస్తే... డీఎస్‌ను టీఆర్ఎస్ మళ్లీ అక్కున చేర్చుకునే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


    అయితే డీఎస్ మద్దతు లేకున్నా... గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో అధిక స్థానాలు గెలుచుకున్న అధికార పార్టీ... మళ్లీ ఆయనను దగ్గరకు తీసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్ ముఖ్యనాయకురాలు కవితతో డీఎస్ తనయుడు సంజయ్ భేటీ తరువాత నిజామాబాద్ టీఆర్ఎస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశం ఆసక్తికరంగా మారింది.

    First published:

    Tags: CM KCR, Congress, D Srinivas, MP Kavitha, Nizamabad, Telangana

    ఉత్తమ కథలు