లగడపాటి లెక్క తప్పిందా.. ఇక సర్వే సన్యాసమేనా?

Telangana assembly elections 2018 | ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే... లెక్క తప్పిందా? తెలంగాణజనం నాడి కనిపెట్టడంలో విఫలమయ్యారా? రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే.. సర్వేలకూ సన్యాసం ప్రకటించాల్సిన సమయం వచ్చిందా?

news18-telugu
Updated: December 11, 2018, 10:39 PM IST
లగడపాటి లెక్క తప్పిందా.. ఇక సర్వే సన్యాసమేనా?
Lagadapati uttam kcr file
news18-telugu
Updated: December 11, 2018, 10:39 PM IST
ఎలాంటి ఎన్నికలు జరిగినా తన సర్వేలతో వార్తల్లో నిలిచే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ సంచలనంగా నిలిచారు. మరోసారి సర్వేతో హల్‌చల్ చేశారు. అయితే, ఆయన చెప్పినదానికి భిన్నంగా ఫలితాలు వెలువడడంతో... ఆ సర్వేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో లగడపాటి సర్వేకు విశ్వసనీయత కొరవడిందనే మాట అటు రాజకీయవర్గాల్లోనూ, ఇటు మీడియావర్గాల్లోనూ చక్కర్లు కొడుతోంది. తర్వాతి ఎన్నికల్లో ఇలాంటి సర్వేలతో ముందుకొచ్చినా.. నమ్మేవారుండనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు మీడియా ముందుకొచ్చిన లగడపాటి... తెలంగాణలో ఇండిపెండెంట్లు హవా ఉండబోతోందంటూ ఇద్దరు పేర్లు లీక్ చేశారు. అప్పుడు పూర్తిగా సర్వే వివరాలు వెల్లడించని లగడపాటి.. సరిగ్గా పోలింగ్‌కు ముందు రోజు మరోసారి మీడియా ముందుకొచ్చి.. ముగ్గురు ఇండిపెండెంట్ల పేర్లు చెప్పారు. తెలంగాణ ప్రజల నాడి హస్తానికి చిక్కిందనీ, ప్రజాకూటమి గెలవబోతోందని చెప్పారు. అయితే, పోలింగ్ రోజు సాయంత్రం నేషనల్ మీడియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపుగా టీఆర్ఎస్‌కు అనుకూలంగా రావడంతో... మరోసారి మీడియా ముందుకొచ్చిన లగడపాటి.. వాటికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. తన సర్వే ప్రకారం టీఆర్ఎస్‌కు 35కు అటు ఇటుగా సీట్లు వస్తాయని, ప్రజాకూటమికి 55 నుంచి అటూఇటుగా సీట్లు వస్తాయని చెప్పారు. దీంతో, కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు సైతం భారీ అంచనాలు పెంచుకున్నారు. ఫలితాలకు ముందురోజు ముందస్తు భేటీలతో హడావిడి చేశారు.
అయితే, అధికారికంగా విడుదలైన ఫలితాలు.. లగడపాటి సర్వే అంచనాలను పూర్తిగా తలకిందులుగా చేసేశాయి. టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 88 సీట్లతో జయకేతనం ఎగరవేసింది. ప్రజాకూటమి 19 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లగడపాటి చెప్పినట్టుగా ఇండిపెండెంట్లు ఏమాత్రం సత్తా చూపలేకపోయారు. కేవలం ఒక్క స్వతంత్ర అభ్యర్థి మాత్రమే గెలిచారు. దీంతో లగడపాటి సర్వే అంతా ట్రాష్ అని చాలామంది కొట్టిపారేస్తున్నారు. అసలు లగడపాటి సర్వే చేసే ఉండరని, అదంతా బూటకపు సర్వే అని మరికొందరంటున్నారు.

ఇటీవల లగడపాటి సర్వేపై స్పందించిన కేటీఆర్.. 2014లో రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక సర్వేల సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని సెటైర్ వేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే లగడపాటికి ఏర్పడిందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్నిరోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న వేళ.. ఇలాంటి పరిస్థితులు తలెత్తడం వల్ల లగడపాటి మరో సర్వే చేసినా పరిగణనలోకి తీసుకోబోరని చెబుతున్నారు.

First published: December 11, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...