లగడపాటి లెక్క తప్పినా.. ఆయన చెప్పింది నిజమైంది: కొత్త ఆక్టోపస్ ఎవరు?

telangana election results 2018 | ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో దిట్టగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ ఎన్నికల విషయంలో మాత్రం లెక్కతప్పారు. లగడపాటి అంచనా తప్పినా.. ఏపీలో మరో కీలక నేత మాత్రం కరెక్టుగా చెప్పారట. మరి, ఏపీలో పుట్టుకొచ్చిన ఆ ఆంధ్రా ఆక్టోపస్ ఎవరు?

news18-telugu
Updated: December 16, 2018, 2:54 PM IST
లగడపాటి లెక్క తప్పినా.. ఆయన చెప్పింది నిజమైంది:  కొత్త ఆక్టోపస్ ఎవరు?
lagadapati vs nani file
  • Share this:
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి  తెలియనివారు తెలుగురాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో సమైక్యాంధ్ర ఉద్యమంతో బాగా ఫేమస్సయ్యారాయన. తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి.. అనంతరం ఎన్నికల ఫలితాలపై సర్వేలు చేయిస్తూ.. ఫలితాలను స్పష్టంగా అంచనా వేస్తూ ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు సంపాదించారు. గతంలో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు లగడపాటి చెప్పినవిధంగానే రావడం.. ఆయనకు మరింత విశ్వసనీయతను తెచ్చిపెట్టాయి. అయితే తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాల విషయంలో మాత్రం.. ఈ ఆంధ్రా ఆక్టోపస్ అంచనాలు తప్పాయి. లగడపాటి చెప్పిన దానికి విరుద్ధంగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే, లగడపాటి లెక్కలు తప్పినా.. ఏపీకి చెందిన కీలకనేత, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నాని లెక్క మాత్రం తప్పలేదంట. ఆయన చెప్పినట్టుగానే టీఆర్ఎస్ 80 సీట్లకుపైగా గెలుచుకుంది. దీంతో, ఆయణ్ని మరో ఆంధ్రా ఆక్టోపస్‌గా పిలుస్తున్నారట.

కేసీఆర్ అసెంబ్లీని రద్దుచేసిన నాటి నుంచే.. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాబోతోందని టీడీపీ నేతల దగ్గర చెబుతూ వస్తున్నారట కేశినేని నాని. టీఆర్ఎస్‌కు 75 నుంచి 80 స్థానాలు వస్తాయని అంచనా వేశారట. అంతేకాదు, కౌంటింగ్ ముందు రోజు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. పిచ్చాపాటిగా ఎంపీలతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. తెలంగాణలో ప్రజాకూటమి ప్రభావం చూపబోతోందని కొందరు ఎంపీలు వాదించినా.. నాని మాత్రం టీఆర్ఎస్సే గెలుస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారట. టీడీపీ 1 నుంచి 2 స్థానాలకు మించి రాకపోవచ్చని కుండబద్దలు కొట్టడంతో.. సహచర ఎంపీలంతా షాకయ్యారట. అయితే, తనకున్న సమాచారం మేరకు జరగబోయేది ఇదేనని వారికి తెలిపారట ఎంపీ నాని.

బెజవాడలో తనను కలిసిన పలువురు నేతలతోనూ నాని ఇదే విషయాన్ని చెప్పారట. కానీ, లగడపాటి సర్వే అప్పటికే విడుదలై ఉండడంతో నాని మాటలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నాని చెప్పిందే చివరకు నిజమైంది. దీంతో, నాని ఏపీలో మరో ఆంధ్రా ఆక్టోపస్‌గా అవతరించారని నేతలు చెప్పుకుంటున్నారట. అటు, ఏపీ రాజకీయాలపైనా నాని స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారట. టీడీపీకి ఏపీలో 100 సీట్లకు తక్కువగా రావని చెబుతున్నారట. మరి తెలంగాణలో నిజమైనట్టే.. నాని చెప్పిన సర్వే ఫలితం ఆంధ్రాలో కూడా నిజమవుతుందో, లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి
First published: December 16, 2018, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading