ఏపీలో శాసనమండలి రద్దుకు ఇది సంకేతమా?

ఏపీ అసెంబ్లీ భవనం

ఏపీలో శాసనమండలి సభ్యులుగా, కేబినెట్ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు నామినేట్ చేశారు సీఎం జగన్.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దుకు ముహూర్తం దగ్గరకొచ్చిందా? ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే ఔననే అనిపిస్తోంది. ఏపీలో శాసనమండలి సభ్యులుగా, కేబినెట్ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు నామినేట్ చేశారు సీఎం జగన్. వ్యాపారవేత్తలు పరిమళ్ నత్వానీ, అయోధ్య రామిరెడ్డితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ కూడా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే, పిల్లి, మోపిదేవి రాజ్యసభ సభ్యులు అయిన వెంటనే తమ మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేయడం ఖాయం. ఇద్దరు మంత్రులను కూడా తమ పదవులకు రాజీనామా చేయించి రాజ్యసభకు పంపడానికి సీఎం జగన్ సిద్ధపడ్డారంటే శాసనమండలి రద్దు గురించి కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతం వచ్చి ఉంటుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది. సీఎం జగన్ తలుచుకుని ఉంటే మరో ఇద్దరు నేతలకు అవకాశం కల్పించి ఉండేవారు. ఆల్రెడీ పదవుల్లో ఉన్న నేతలను వారి పదవులకు రాజీనామా చేయించి మరీ రాజ్యసభకు పంపడం అంటే.. త్వరలో ఎలాగూ వారి పదవులు పోతాయనే ఉద్దేశంతోనే జగన్ అలా చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ముఖేష్ అంబానీకి సన్నిహితుడిగా పేరున్న పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టికెట్ ఇవ్వడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

    ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఏపీ శాసనసభతో పాటు శాసనమండలి కూడా సమావేశం అవుతుంది. ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు కాబట్టి, తమ దృష్టిలో  కౌన్సిల్ లేదని రద్దయిపోయిందని చెప్పడానికే జగన్... పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవికి రాజ్యసభ సీటు ఇచ్చారనే అభిప్రాయం వినిపిస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: