news18-telugu
Updated: March 5, 2019, 12:13 AM IST
మార్చి 1న కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ప్రకటించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక పర్యటనలు పూర్తికావాలని ఎన్నికల సంఘం ఎదురుచూస్తోందని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆరోపించారు. ప్రభుత్వ ఖర్చులతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు వీలు కల్పించేలా ఎన్నికల సంఘం తీరు ఉందని ఆయన ధ్వజమెత్తారు. అందుకే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక పర్యటనలు పూర్తికావాలని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో పత్రికలు, టీవీలు, రేడియాల్లో ప్రచారాల కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వినియోగిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాజకీయ ప్రకటనలకు ఎన్నికల సంఘం కూడా వీలు కల్పిస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 8న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన మరింత ఆలస్యం కాకుండా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహంతోనే కాంగ్రెస్ ఈ రకమైన ఆరోపణలు చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
First published:
March 5, 2019, 12:13 AM IST