Home /News /politics /

జగన్ ‘రివర్స్’ వ్యూహం... ఆ కంపెనీతో పాటు చంద్రబాబే టార్గెట్ ?

జగన్ ‘రివర్స్’ వ్యూహం... ఆ కంపెనీతో పాటు చంద్రబాబే టార్గెట్ ?

సీఎం వైఎస్ జగన్

సీఎం వైఎస్ జగన్

పోలవరం, కృష్ణపట్నం సెజ్ వ్యవహారాల్లో జగన్ ప్రభుత్వ నిర్ణయాలు నవయుగ యాజమాన్యంతో పాటు చంద్రబాబుకూ భారీ షాక్‌లుగానే పరిగణించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

  ఏపీలో నవయుగ సంస్ధకు తగులుతున్న వరుస షాక్ లు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే నవయుగ సంస్ధకు తొలుత పోలవరం కాంట్రాక్టు రివర్స్ టెండరింగ్ తో షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కృష్ణపట్నం సెజ్ భూముల రద్దుతో కోలుకోలేని దెబ్బతీసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా సెజ్ ఏర్పాటు కోసం ఇచ్చిన 4700 ఎకరాల భూములను పనులు జరగడం లేదన్న కారణంతో జగన్ సర్కారు రద్దు చేయడం వెనుక భారీ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.

  నాలుగేళ్ల క్రితం పోలవరం ప్రాజెక్టు పనులను తమ పార్టీకే చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ నుంచి తప్పించి నవయుగ ఇంజనీరింగ్ కు టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. ట్రాన్స్ ట్రాయ్ కు ఈపీసీ విధానంలో పనులు అప్పగించిన చంద్రబాబు సర్కారు... ఆ తర్వాత నవయుగకు మాత్రం ఎల్ఎస్ విధానంలో పనులు కట్టబెట్టింది. టీడీపీ ప్రభుత్వం గద్దె దిగడానికి ముందు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే నవయుగ సంస్ధ పోలవరం పనులు ఆపేసింది. ప్రభుత్వం మారితో బిల్లులు రావన్న భయమో, మరే కారణమో తెలియదు కానీ నవయుగ మాత్రం పనులు నిలిపేసింది.

  దీంతో తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు.... నిర్ణీత సమయంలో పనులు చేయలేదనే కారణంతోనే నవయుగను ఏకంగా కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ ప్రీ క్లోజర్ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత పోలవరం ప్రధాన డ్యామ్ పనుల నుంచి తమను తప్పించడంపై స్పందించని నవయుగ సంస్ధ, హైడల్ ప్రాజెక్టు విషయంలో మాత్రం హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. అయినా జగన్ సర్కారు ఇవేవీ పట్టించుకోకుండా రెండు ప్రాజెక్టులకూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లి అనుకున్న ఫలితాన్ని రాబట్టింది. అంతే కాదు ఈ కాంట్రాక్టు రివర్స్ టెండరింగ్ లో సైతం నవయుగ పాల్గొనలేదు.

  నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చేసిన నవయుగ సంస్ధకు, దానికి పోర్టుకు అనుబంధంగా సెజ్ నిర్మించేందుకు 2008లో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4700 ఎకరాల భూమి కేటాయించారు. ఆ తర్వాత 2010లో కేంద్రం దీనికి అనుమతులు కూడా మంజూరు చేసింది. ఆటోమొబైల్, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్ట్ స్టోరేజ్, కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్, భారీ యంత్ర పరికరాలు, ఐటీ, తోలు, ఫార్మా, రిఫైనరీ, టెక్స్ టైల్ పార్క్ లు, గృహసముదాయాలు, విద్యాసంస్ధలు నిర్మించేందుకు వీలుగా దీన్ని ప్రభుత్వం నవయుగకు ఇచ్చింది.


  ఆ తర్వాత ఈ భూములను తనఖా పెట్టి నవయుగ సంస్ధ వివిధ బ్యాంకుల నుంచి 2 వేల కోట్ల రూపాయలు రుణాలు తెచ్చుకుంది. అదే సమయంలో వివిధ అభివృద్ది ప్రాజెక్టుల కోసం మరో 6200 ఎకరాలు ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఇప్పటివరకూ అక్కడ ఒకటీ అరా నామమాత్రపు నిర్మాణాలు మాత్రమే చేసింది. దీంతో జగన్ సర్కారు 4700 ఎకరాల భూముల కేటాయింపును రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది.

  ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో నవయుగకు గత ప్రభుత్వం ఇచ్చిన 3200 కోట్ల విలువైన పనులను రద్దు చేసిన జగన్ సర్కారు.. ఇప్పుడు 4700 ఎకరాల భూములను కూడా రద్దు చేయడంతో ఆ సంస్ధ భవితవ్యం ప్రమాదంలో పడింది. ఇప్పటికే నవయుగకు 2 వేల కోట్లు రుణాలిచ్చిన బ్యాంకులు త్వరలో నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. నవయుగ సంస్ధకు ఈ స్ధాయిలో వరుసగా తగులుతున్న షాక్‌ల వెనుక చంద్రబాబు ఆర్ధిక మూలాలను దెబ్బతీయాలన్న జగన్ సర్కారు ఉద్దేశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పోలవరం, కృష్ణపట్నం సెజ్ వ్యవహారాల్లో జగన్ ప్రభుత్వ నిర్ణయాలు నవయుగ యాజమాన్యంతో పాటు చంద్రబాబుకూ భారీ షాక్‌లుగానే పరిగణించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

  సయ్యద్ అహ్మద్, న్యూస్18 కరస్పాండెంట్, అమరావతి
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Chandrababu naidu, Polavaram, Tdp, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు