తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రజాకూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అదే సమయంలో... ఇదివరకటి కంటే ఎక్కువ సీట్లు (88) సాధించి... టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా అవతరించింది. ఆ సంతోష సమయంలో... తెలంగాణలో టీడీపీ నేతలను పోటీ చేయించినందుకు ఆగ్రహించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. తద్వారా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో... టీఆర్ఎస్... వైసీపీ తరపున ప్రచారం చేస్తుందనీ కొన్నాళ్లూ... లేదు టీఆర్ఎస్సే డైరెక్టుగా ఎన్నికల్లో పోటీ చేయబోతుందని కొన్నాళ్లూ ఊహాగానాలు వినిపించాయి. ఐతే... టీఆర్ఎస్ గనక ఏపీలో అడుగుపెడితే... అది టీడీపీకి కలిసొస్తుందనీ, ఆంధ్రా సెంటిమెంట్ రగులుతుందనీ సబ్బం హరి లాంటి నేతలు చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కాస్త వెనకడుగు వేసింది. ఆ తర్వాత వైసీపీతో కూడా తెరపైన ఎలాంటి సంబంధాలూ నెరపకుండా దూరంగా ఉంటూ వచ్చింది. అలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరించింది.
టీఆర్ఎస్ గనక ఏపీలో అడుగుపెడితే, తమకు కలిసొస్తుందని బలంగా నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు... తమ ఎన్నికల ప్రచారంలో... పదే పదే టీఆర్ఎస్‌నూ, కేసీఆర్‌నూ టార్గెట్ చేశారు. హైదరాబాద్‌ని తానే నిర్మించాననీ, అలాంటి తననే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బెదిరిస్తున్నారనీ ప్రజల ముందు మాట్లాడారు. కేసీఆర్ ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే... తాను 100 రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తానని చంద్రబాబు చాలాసార్లు అన్నారు. ఇలా పదే పదే చంద్రబాబు విమర్శిస్తుంటే... చూసీ చూసీ కోపం వచ్చిన కేసీఆర్... తాము ఏపీకి వ్యతిరేకం కాదనీ, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటుంటే కూడా అడ్డుకోలేదనీ, ప్రత్యేక హోదాకు కూడా తాము వ్యతిరేకంగా లేమనీ స్పష్టం చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన చంద్రబాబు... సరిగ్గా ఎన్నికల తొలి దశ జరిగే 48 గంటల ముందు కొన్ని వీడియో క్లిప్పింగులను మీడియా ముందు చూపించారు. తద్వారా కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు చెబుతున్నదానికీ, ఒకప్పుడు చెప్పిన దానికీ సంబంధం లేదనీ, మాట మార్చారనీ, ఆంధ్రా ప్రజలు వాళ్లను నమ్మొద్దనీ కోరారు. ఇలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-వైసీపీ మధ్య రిటర్న్ గిఫ్ట్ వార్ నడిచింది.
ఇప్పుడు ఏపీలో తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ లగడపాటి, సబ్బం హరి లాంటి వాళ్లు చెబుతుండటంతో... నిజంగానే టీడీపీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్‌కి ఇస్తారన్న చర్చ నడుస్తోంది. టీడీపీ తిరిగి అధికారంలోకి రావడమే పెద్ద రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు ఆ పార్టీ నేతలు.
రాజకీయ విశ్లేషకులు మాత్రం... టీడీపీ అధికారంలోకి వస్తే, ఇక ఈ రిటర్న్ గిఫ్టుల వివాదం అక్కడితో క్లోజ్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారనీ, యూపీఏ పక్షాలకు మద్దతిచ్చేందుకు కేసీఆర్ ముందుకు రావని చంద్రబాబు కోరడం ఇందులో భాగమేనని అంటున్నారు వాళ్లు. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా... టీడీపీతోపాటూ... టీఆర్ఎస్ కూడా అడుగులు వేస్తోందనీ, కొన్ని డిమాండ్లపై స్పష్టమైన హామీలూ, పార్టీకి తగిన గుర్తింపూ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడితే... టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌కి కేంద్రంలో సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అప్పుడిక తెలుగు రాష్ట్రాలూ వేటికవే తమ అభివృద్ధిపై దృష్టిసారించే పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు.
ఒకవేళ టీడీపీ కాకుండా వైసీపీ గెలిస్తే... అది చంద్రబాబుకి టీఆర్ఎస్ పరోక్షంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లే అవుతుందన్న విశ్లేషణ కూడా ఉంది. వైసీపీతో తాము ఎలాంటి డీల్సూ కుదుర్చుకోలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నా... తెరవెనక వైసీపీకి టీఆర్ఎస్ పరోక్ష మద్దతు కొనసాగుతోందనీ, అందువల్ల వైసీపీ ద్వారా చంద్రబాబుకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు భావించవచ్చని అంటున్నారు. మొత్తానికి ఏ ప్రత్యేక హోదా అంశమో కాకరేపకుండా... ఈ రిటర్న్ గిఫ్ట్ అంశం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ చర్చనీయాంశం అవ్వడం చిత్రమే.
ఇవి కూడా చదవండి :
Video : అపార్ట్‌మెంట్‌లో చిరుత... వల్లో చిక్కి... ఎగిరి గంతేసి...
కూర బాలేదన్న భర్త... సూసైడ్ చేసుకున్న భార్య...
లగడపాటి సర్వే... లాజిక్ మిస్సైందా... టీడీపీ, వైసీపీకి తగ్గితే... జనసేనకు పెరగలేదేం..?
వైసీపీకి 120... రోజా ఓటమి... ఆ సంస్థ సర్వేలో అంచనాలు ఇవీ...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Kcr, KCR Return Gift, Trs