Home /News /politics /

IS AP MINISTER PERNI NANI SENSATIONAL COMMENTS ON BJP AND CENTRE LEADS TO NEW POITICAL EQUATIONS AK

Andhra Pradesh: బీజేపీపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు.. అసలు కారణం ఇదేనా ?

మంత్రి పేర్ని నాని (ఫైల్ ఫోటో)

మంత్రి పేర్ని నాని (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: వైసీపీ నేతలు బీజేపీ, కేంద్రం తీరుపై ఇదే రకమైన దూకుడును కొనసాగిస్తే మాత్రం.. ఏపీలోని జగన్ సర్కార్ కేంద్రంతో అనుసరించే విధానంలో మార్పు వచ్చినట్టు అనుకోవాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    బీజేపీపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ భేటీ అంశాలను మీడియాకు వివరించిన మంత్రి పేర్ని నాని.. ఇదే క్రమంలో బీజేపీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చాలని చూస్తోందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కాషాయ కండువా కప్పుకున్న వాళ్లు సీఎం కావాలని అనుకుంటున్నారని ఆరోపించారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఎలా మాట్లాడుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించిన మంత్రి పేర్ని నాని.. కేంద్రం అప్పులు చేయడం లేదా ? అని ప్రశ్నించారు. అయితే సాధారణంగా బీజేపీ నేతలు, కేంద్రంపై పెద్దగా విమర్శలు చేయని ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు.. ఉన్నట్టుండి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ మంత్రి పేర్ని నాని మామూలుగానే ఈ వ్యాఖ్యలు చేశారా లేక కేంద్రానికి, బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చే కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేశారా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయని వైసీపీ సర్కార్ భావిస్తోంది. ఈ రకమైన వ్యాఖ్యలు రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు సరికొత్త ఆయుధంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది. ఈ కారణంగానే కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

    ఈ క్రమంలోనే కేంద్రం తీరుకు సరైన కౌంటర్ ఇవ్వకపోతే.. భవిష్యత్తులోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్స్ రావొచ్చని వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై నేడు జరిగిన కేబినెట్ భేటీలో చర్చ జరిగిన తరువాతే.. ఏపీ మంత్రి పేర్ని నాని కేంద్రం, బీజేపీపై ఇంత తీవ్రమైన, సంచలనమైన వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం ముందు ముందు కూడా కేంద్రం, బీజేపీపై ఇదే రకమైన తీరును ప్రదర్శిస్తుందా ? లేక కేవలం ఒకసారి వారికి కౌంటర్ ఇచ్చి ఊరుకుంటుందా ? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ వైసీపీ నేతలు బీజేపీ, కేంద్రం తీరుపై ఇదే రకమైన దూకుడును కొనసాగిస్తే మాత్రం.. ఏపీలోని జగన్ సర్కార్ కేంద్రంతో అనుసరించే విధానంలో మార్పు వచ్చినట్టు అనుకోవాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్సెస్ బీజేపీ అనే కొత్త సమీకరణానికి తెరలేపుతాయి అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap minister perni nani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు