ఏపీలో సినిమా టికెట్ల అంశంపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు దాదాపుగా తెరపడినట్టే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఏపీ సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఆ తరువాత దీనిపై మాట్లాడిన చిరంజీవి.. పది రోజుల్లో దీనిపై ఏపీ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. సీఎం జగన్ సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్నారని చిరంజీవి చెప్పారు. అయితే కొంతకాలం నుంచి ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని తలలు పట్టకుంటున్న సినీవర్గాలకు సీఎం జగన్‌తో చిరంజీవి సమావేశం బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే ఉన్నట్టుండి సీఎం జగన్‌తో చిరంజీవి సమావేశం కావడం వెనుక అసలేం జరిగిందనే అంశంపై కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్‌ను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కలిసి తమ సమస్యలు చెప్పుకుంటామని సినీ ప్రముఖులు అనేక వేదికలపై బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే సినీ రంగంలోని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఏపీ ప్రభుత్వం.. వారికి సమయం మాత్రం ఇవ్వడం లేదనే వాదనలు వినిపించాయి. దీనికితోడు అప్పటివరకు తన దగ్గర ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖను మంత్రి పేర్ని నానికి అప్పగించిన సీఎం జగన్.. ఈ అంశంపై చర్చలు జరిపే బాధ్యతను పూర్తిగా మంత్రి పేర్ని నానికి ఇచ్చారనే వార్తలు వచ్చాయి.
అందుకు తగ్గట్టుగానే సినీ పరిశ్రమకు సంబందించిన సమస్యలతో పాటు ఈ అంశంపై సినీ రంగానికి చేసే కామెంట్స్‌కు కూడా మంత్రి పేర్ని నానినే ఎక్కువగా సమాధానం చెబుతూ వచ్చారు. దీంతో ఏపీ సినిమా టికెట్ల ధరల అంశం ఎప్పటికీ పరిష్కారమవుతుందనే అంశంపై క్లారిటీ రాక సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. అలాంటి సమయంలో సీఎం జగన్‌తో చిరంజీవి సమావేశం కావడం.. అనంతరం ప్రభుత్వం సినీ రంగంలోని సమస్యల పరిష్కారానికి, సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పడం టాలీవుడ్ వర్గాలకు ఊరట కలిగించింది.
అయితే ప్రభుత్వం సినిమా టికెట్ల పెంపు వ్యవహారంపై నెలకొన్న గందరగోళానికి ముగింపు పలకాలని నిర్ణయించడం వల్లే సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ జరిగిందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం ఈ అంశంపై మరికొంతకాలం ఇదే రకమైన డైలమా కొనసాగించాలని అనుకుంటే కొనసాగించే అవకాశం ఉండేదని.. కానీ ఈ అంశానికి ఏదో రకమైన ముగింపు పలకాలని భావించడం వల్లే ఈ భేటీ జరిగిందనే వాదన వినిపిస్తోంది.
దీనికి తోడు ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ఒకరు సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దీనికి ప్రతిగా సినీ ప్రముఖులు కూడా గట్టిగానే స్పందించడంతో.. ఈ వివాదం ఎటు నుంచి ఎటు వైపు వెళుతుందో అనే చర్చ మొదలైంది. ఈ సమస్య మరింత ఎక్కువకాలం కొనసాగితే.. ఇలాంటి లేనిపోని కొత్త వివాదాలు మరిన్ని పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని.. అందుకే సినీ రంగంలోని చిరంజీవి చొరవ తీసుకుని ప్రభుత్వంతో చర్చించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడంతో టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అనే వివాదానికి ఫుల్స్టాప్ పడినట్టే అని భావించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chiranjeevi