స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్నభారతీయులకు దిమ్మతిరిగే షాక్ తగలనుంది. ఇకపై అలా డబ్బులు దాచుకున్న వారి వివరాలను వెల్లడిస్తామని చెబుతున్న ప్రభుత్వం దీనిపై ఓ స్పష్టత ఇచ్చింది. నల్లధనంను వెలికి తీసేందుకు కంకణం కట్టుకున్న మోడీ సర్కార్ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. తాజాగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయు ఖాతాలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామంటూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వెల్లడించింది. దీని ప్రకారం స్విట్జర్లాండ్లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు నేటి నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న బడా బాబుల గుండెలు గుబేల్ మంటున్నాయి.
భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో స్విస్ ఖాతాల వివరాలు భారత్కు తెలియనున్నాయి. నల్లధనంను అరికట్టేందుకు కంకణం కట్టుకున్న మోడీ సర్కార్ ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్ బ్యాంకుల లోగుట్టు శకం ఎట్టకేలకు ముగిసినట్లు అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. దీనిపై సీబీడీటీ ఆదాయపు పన్ను విభాగానికి ఓ విధానాన్ని రూపొందించింది.
స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ఫైనాన్స్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి నికోలస్ మారియో ఈనెల 29, 30 తేదీల్లో భారత రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీలతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. పన్నుకు సంబంధించిన భారత్ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ఇరుదేశాల అధికారులు చర్చించారు. స్విట్జర్లాండ్లో 2018 సంవత్సరంలో భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను భారత్ అందుకుంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో 2018లో క్లోజ్ అయిన ఖాతాల వివరాలు కూడా ఉంటాయని తెలిపింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.